IPL 2023 SRH VS RCB: ఆర్సీబీని భయపెడుతున్న కోహ్లి

IPL 2023 SRH VS RCB: Virat Kohli Out For Golden Duck In Last Two Matches Vs SRH - Sakshi

హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం (ఉప్పల్‌) వేదికగా సన్‌రైజర్స్‌తో ఇవాళ (మే 18) జరుగబోయే అత్యంత కీలకమైన మ్యాచ్‌కు ముందు విరాట్‌ కోహ్లి.. తన సొంత జట్టు ఆర్సీబీనే బయపెడుతున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌పై ఓ మోస్తరు రికార్డు (20 మ్యాచ్‌ల్లో 31.61 సగటున 136.77 స్ట్రయిక్‌ రేట్‌తో 569 పరుగులు) కలిగిన కోహ్లి.. ఆ జట్టుతో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్‌ డకౌట్‌ (తొలి బంతికే ఔట్‌) కావడమే ఆర్సీబీ భయానికి కారణం.

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే అత్యంత కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ అయినా లేక విఫలమైనా ఆర్సీబీ అభిమానులు, ఆ జట్టు యాజమాన్యం అస్సలు తట్టుకోలేని పరిస్థితి. ప్రస్తుత సీజన్‌లో కేవలం KGF (కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌) మెరుపులతో ఇంత వరకు నెట్టుకొచ్చిన ఆర్సీబీ.. తమకు అత్యంత కీలకమైన తదుపరి రెండు మ్యాచ్‌ల విషయంలో కోహ్లిపై భారీ అంచనాలు పెట్టుకుంది.

ఈ రెండు మ్యాచ్‌ల్లో కోహ్లి విజృంభిస్తే, ఈ సాలా కప్‌ నమ్‌దే (ఈ సారి కప్‌ మాదే) అని ఫ్యాన్స్‌ అంటున్నారు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు వేదిక అయిన ఉప్పల్‌ స్టేడియం కోహ్లికి అచ్చొందే అయినప్పటికీ.. ఆర్సీబీ ఫ్యాన్స్‌లో ఏదో మూల కీడు శంకిస్తుంది. ఓ వైపు సన్‌రైజర్స్‌ అభిమానులు సైతం తమకే మద్దతుగా నిలబడుతున్నప్పటికీ.. ఆర్సీబీ అభిమానుల్లో ఏదో తెలియని కలవరం నెలకొంది. నాసికరం జట్టుతో ఇంతవరకు నెట్టుకొచ్చిన KGF.. తదుపరి మ్యాచ్‌ల్లో అంచనాలకు మించి రాణించాలని ఆర్సీబీ ఫ్యాన్స్‌ దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. తదుపరి జరుగబోయే మ్యాచ్‌ల్లో విజృంభించి, ఈ ఏడాదైనా కోహ్లికి ఐపీఎల్‌ టైటిల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆర్సీబీ ఆటగాళ్లు సైతం భావిస్తున్నారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో గెలుపుతో సన్‌రైజర్స్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ, ఆర్సీబీకి మాత్రం అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారతాయి. ఆర్సీబీకి మరో మ్యాచ్‌ ఆడే అవకాశం ఉన్నా, అది టేబుల్‌ టాపర్‌ గుజరాత్‌తో (మే 21న) కావడం, అదీ భారీ తేడాతో గెలవాల్సి ఉండటం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారుతుంది. 

చదవండి: సన్‌రైజర్స్‌తో కీలక మ్యాచ్‌..! బౌలింగ్‌ చేసిన కోహ్లి.. ‘కేజీఎఫ్‌’ వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top