#IPLFinal2023: దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా!

IPL 2023 Final: CSK Fans Worried If-Match Abandoned-Rain-GT-Win Title - Sakshi

కరోనాతో రెండేళ్ల పాటు ఐపీఎల్‌ చాలా చప్పగా సాగింది. స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఆటగాళ్లు కూడా కాస్త బోర్‌ ఫీలయ్యారు. అయితే ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆ సీన్‌ను మొత్తం రివర్స్‌ చేసేసింది. ఇన్నేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన సీజన్‌గా ఐపీఎల్‌ 2023 చరిత్రకెక్కనుంది. కారణం దాదాపు అన్ని మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగడం.. స్టేడియాల్లోకి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం.. ధోని లాంటి ఆటగాళ్ల కోసం ఈ సీజన్‌ను టీవీల్లోనూ చాలా మంది ఎంజాయ్‌ చేయడం కనిపించింది. 

అలా దాదాపు రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌ 16వ సీజన్‌కు నేటితో తెరపడనుంది. ఆదివారం(మే 28న) ఫైనల్లో సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. సీఎస్‌కే ఐదోసారి కప్పు కొడుతుందా లేక గుజరాత్‌ వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా అనేది పక్కనబెడితే మాకు మాత్రం ఫుల్‌ కిక్కు ఖాయం అని అభిమానులు భావించారు.

కానీ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడు శనిలాగా తయారయ్యాడు. ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించాలని మధ్యాహ్నం నుంచే స్టేడియం ముందు ప్రేక్షకులు బారులు తీరారు. అదే సమయంలో వరుణుడు కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో టాస్‌ కూడా ఆలస్యం అయింది. మ్యాచ్‌ సమయం గంట దాటినా వర్షం జోరు మాత్రం తగ్గడం లేదు. పూర్తి మ్యాచ్‌ కాకపోయినా కనీసం ఐదు ఓవర్ల ఆట అయినా సాధ్యపడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం.

మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉన్నప్పటికి సోమవారం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మ్యాచ్‌ జరగకుండానే టైటిల్‌ విజేతను ప్రకటిస్తారేమోనని అభిమానులు బాధపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే  లీగ్‌లో టాపర్‌గా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ విజేతగా నిలుస్తుంది. అలా చూస్తే ఇది సీఎస్‌కేకు నష్టం మిగిల్చే అంశం. ధోనికి చివరి ఐపీఎల్‌ అని భావిస్తున్న వేళ వర్షం కారణంగా ఇలా జరిగితే మాత్రం సీఎస్‌కే అభిమానులకు మింగుడుపడని అంశమే.

అయితే ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఏ మ్యాచ్‌కు అడ్డుపడని వరుణుడు ఫైనల్‌ మ్యాచ్‌కు ఇలా చేయడం ఏంటని అభిమానులు తెగ ఫీలవుతున్నారు. ఏదో కాసేపు పడి వర్షం ఆగిపోతుందనుకుంటే పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేని వర్షం ఇప్పుడే పడాలా.. అంటూ అభిమానులు కామెంట్‌ చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top