IPL 2023 DC Vs MI Match Live Score Updates, Highlights And Latest News Updates - Sakshi
Sakshi News home page

IPL 2023 MI vs DC: దుమ్మురేపిన రోహిత్‌, తిలక్‌.. ఎట్టకేలకు ముంబై బోణీ

Apr 11 2023 7:10 PM | Updated on Apr 12 2023 8:20 AM

IPL 2023: Delhi Capitals Vs Mumbai Indians Match Updates-Highlights - Sakshi

‘సీనియర్లు మరింత బాధ్యత తీసుకోవాలి... అది నాతోనే మొదలు కావాలి... గత మ్యాచ్‌లో ఓటమి తర్వాత ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. దానికి  తగినట్లుగానే బ్యాటింగ్‌లో సత్తా చాటిన రోహిత్‌... అంతకుముందు సారథిగా మైదానంలో ప్రణాళికలు సరిగ్గా అమలు చేసి చూపించాడు. బౌలింగ్‌లో పీయూష్‌ చావ్లా, బెహ్రన్‌డార్ఫ్‌ ... బ్యాటింగ్‌లో రోహిత్, తిలక్‌ వర్మ కీలకపాత్ర పోషించడంతో మాజీ చాంపియన్‌కు రెండు ఓటముల తర్వాత తొలి విజయం దక్కింది. మరోవైపు అక్షర్‌ పటేల్, వార్నర్‌ ఆటతో పడుతూ లేస్తూ కాస్త గౌరవప్రదమైన స్కోరు చేసినా... సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. వరుసగా నాలుగు పరాజయాలతో ఆ జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

న్యూఢిల్లీ: ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ తాజా సీజన్‌లో గెలుపు బోణీ చేసింది. మంగళవారం చివరి బంతి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అక్షర్‌ పటేల్‌ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), డేవిడ్‌ వార్నర్‌ (47 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు.

స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా, పేసర్‌ బెహ్రన్‌డార్ఫ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ (45 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (29 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.  

అక్షర్‌ మెరుపులు... 
వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఢిల్లీ పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శన కొనసాగింది. పృథ్వీ షా (15) ఈసారి రెండంకెల స్కోరు చేసినా పెద్దగా ప్రభావం చూపలేదు. మూడో స్థానంలో వచ్చిన మనీశ్‌ పాండే (18 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే 22 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది.

సీనియర్‌ స్పిన్నర్‌ చావ్లా వరుసగా తన మూడు ఓవర్లలో ఒక్కో వికెట్‌ చొప్పున పాండే, రావ్‌మన్‌ పావెల్‌ (4), లలిత్‌ యాదవ్‌ (2)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో వార్నర్, అక్షర్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. 98/5 వద్ద బరిలోకి దిగిన అక్షర్‌ జోరుతో ఢిల్లీ కోలుకుంది. అయితే చివర్లో ఢిల్లీ పూర్తిగా కుప్పకూలింది. 18 ఓవర్లలో స్కోరు 165/5 కాగా... తర్వాతి 10 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ మరో 7 పరుగులు మాత్రమే చేసింది! బెహ్రన్‌డార్ఫ్‌ వేసిన 19వ ఓవర్లోనే ఒక రనౌట్‌ సహా మొత్తం 4 వికెట్లు పడ్డాయి.  

రాణించిన తిలక్‌... 
ఛేదనలో ముంబైకి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, ఇషాన్‌ కిషన్‌ (26 బంతుల్లో 31; 6 ఫోర్లు) ధాటికి ముంబై పవర్‌ప్లేలో 68 పరుగులకు చేసింది. సమన్వయలోపంతో ఇషాన్‌ రనౌట్‌ కాగా, మూడో స్థానంలో బరిలోకి దిగిన తిలక్‌ కూడా అదే జోరును కొనసాగించడంతో ముంబై వేగంగా గెలుపు దిశగా సాగింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో 2 సిక్సర్లు కొట్టిన తిలక్‌... ముకేశ్‌ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదాడు.

అయితే ఈ ఓవర్లోనే తిలక్‌తో పాటు సూర్యకుమార్‌ (0)ను కూడా ముకేశ్‌ అవుట్‌ చేశాడు. విజయానికి మరో 30 పరుగుల దూరంలో రోహిత్‌ వెనుదిరిగినా... కామెరాన్‌ గ్రీన్‌ (17 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌ (13 నాటౌట్‌) కలిసి మ్యాచ్‌ను ముగించారు. నోర్జే వేసిన చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం రాగా, తొలి ఐదు బంతుల్లో 3 పరుగులే వచ్చాయి. దాంతో కాస్త ఉత్కంఠ పెరిగింది. అయితే ఆఖరి బంతికి బ్యాటర్లు 2 పరుగులు రాబట్టగలగడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది.   

స్కోరు వివరాలు 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) మెరిడిత్‌ (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 51; పృథ్వీ షా (సి) గ్రీన్‌ (బి) హృతిక్‌ షోకీన్‌ 15; మనీశ్‌ పాండే (సి) బెహ్రన్‌డార్ఫ్‌ (బి) చావ్లా 26; యశ్‌ ధుల్‌ (సి) నేహల్‌ వధేరా (బి) మెరిడిత్‌ 2; పావెల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 4; లలిత్‌ (బి) చావ్లా 2; అక్షర్‌ పటేల్‌ (సి) అర్షద్‌ ఖాన్‌ (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 54; అభిషేక్‌ (సి) గ్రీన్‌ (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 1; కుల్దీప్‌ (రనౌట్‌) 0; నోర్జే (బి) మెరిడిత్‌ 5; ముస్తఫిజుర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 172.
వికెట్ల పతనం: 1–33, 2–76, 3–81, 4–86, 5–98, 6–165, 7–166, 8–166, 9–166, 10–172. 
బౌలింగ్‌: బెహ్రన్‌డార్ఫ్‌ 3–0–23–3, అర్షద్‌ ఖాన్‌ 1–0–12–0, గ్రీన్‌ 3–0–30–0, హృతిక్‌ షోకీన్‌ 4–0–43–1, మెరిడిత్‌ 3.4–0–34–2, పీయూష్‌ చావ్లా 4–0–22–3, తిలక్‌ వర్మ 1–0–7–0. 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) అభిషేక్‌ (బి) ముస్తఫిజుర్‌ 65, ఇషాన్‌ కిషన్‌ (రనౌట్‌) 31; తిలక్‌ వర్మ (సి) మనీశ్‌ పాండే (బి) ముకేశ్‌ 41; సూర్యకుమార్‌ (సి) కుల్దీప్‌ (బి) ముకేశ్‌ 0; టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 13, గ్రీన్‌ (నాటౌట్‌) 17, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–71, 2–139, 3–139, 4–143.  బౌలింగ్‌: ముకేశ్‌ 2–0–30–2, ముస్తఫిజుర్‌ 4–0–38–1, నోర్జే 4–0–35–0, లలిత్‌ 4–0– 23–0, అక్షర్‌ 4–0–20–0, కుల్దీప్‌ 2–0–23–0. 


ఐపీఎల్‌లో నేడు 
చెన్నైVS రాజస్తాన్‌ (రాత్రి గం. 7:30 నుంచి) 
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement