#David Warner Tweet On SRH Win: సన్‌రైజర్స్‌ విజయంపై డేవిడ్‌ వార్నర్‌ ట్వీట్‌! మెచ్చుకున్నాడా? లేదంటే..

IPL 2023: David Warner Reaction On SRH Crazy Win On RR Goes Viral - Sakshi

IPL 2023 RR Vs SRH: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇప్పటివరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ట్రోఫీని అందించిన ఏకైక కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. 2016లో అనూహ్య రీతిలో రైజర్స్‌ను విజేతగా నిలిపి తొలి టైటిల్‌ అందించాడు. ఈ నేపథ్యంలో ఆరెంజ్‌ ఆర్మీతో అనుబంధం పెనవేసుకున్న వార్నర్‌ అన్న.. అనుకోని పరిస్థితుల్లో అవమానకర రీతిలో జట్టును వీడాల్సి వచ్చింది. 

ఈ క్రమంలో 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ వార్నర్‌ను 6.25 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఢిల్లీకి ఆడుతున్న వార్నర్‌ భాయ్‌.. ఐపీఎల్‌-2023లో రిషబ్‌ పంత్‌ గైర్హాజరీలో ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 24న సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత ఉప్పల్‌లో అడుగుపెట్టిన వార్నర్‌.. కెప్టెన్‌గా విజయం అందుకున్నాడు.

ప్రతీకార విజయం
అతడి సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ 7 పరుగుల తేడాతో రైజర్స్‌పై విజయం సాధించింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 29 నాటి ఢిల్లీ మ్యాచ్‌లో గెలుపొంది క్యాపిటల్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది సన్‌రైజర్స్‌. ఈ సీజన్‌లో ఇలా ముఖాముఖి పోరులో ఇరు జట్లు చెరో విజయం అందుకున్నాయి. అదే విధంగా పాయింట్ల పట్టికలో తొమ్మిది, పది స్థానాల్లో దోబూచులాడుతున్నాయి.

గ్లెన్‌ వల్లే
ఇదిలా ఉంటే.. రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ అద్భుతం చేసిన విషయం తెలిసిందే. ఆఖరి బంతికి నో బాల్‌ ట్విస్ట్‌ చేసుకోవడంతో రైజర్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్‌లో హైలైట్‌ అంటే గ్లెన్‌ ఫిలిప్స్‌ ఇన్నింగ్స్‌ అని చెప్పవచ్చు. 13.25 ‍కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు వరుస అవకాశాలు ఇచ్చిన యాజమాన్యం.. ఎట్టకేలకు ఈ మ్యాచ్‌తో ఫిలిప్స్‌నకు ఛాన్స్‌ ఇచ్చింది.

ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫిలిప్స్‌ కీలక సమయంలో వరుసగా 6,6,6,4 బాది తన విలువేంటో చాటుకున్నాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ ఎడిషన్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.

ఏది అవసరమో అది చేసి చూపించాడు
ఈ నేపథ్యంలో డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్‌ విజయాన్ని ఉద్దేశించిన ట్వీట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘ఐపీఎల్‌కు ఏది అవసరమో గ్లెన్‌ ఫిలిన్స్‌ అదే చేశాడు.. టేక్‌ ఏ బో! సన్‌రైజర్స్‌ బాగా ఆడింది’’ అని వార్నర్‌ ప్రశంసలు కురిపించాడు.

మిస్‌ యూ వార్నర్‌
దీనిపై ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘మిస్‌ యూ వార్నర్‌.. నువ్వు జట్టులో లేకున్నా మా గుండెల్లో మాత్రం ఉన్నావు’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఫిలిప్స్‌ను ఇన్నాళ్లు ఆడించకుండా రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన తప్పిదాన్ని వార్నర్‌ భలేగా ఎత్తిచూపాడని పేర్కొంటున్నారు.

చదవండి: జాగ్రత్త.. అతడు హీరో! సమద్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ ట్వీట్‌ వైరల్‌.. ఫ్యాన్స్‌ మాత్రం..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top