#Abdul Samad: జాగ్రత్త.. అతడు హీరో! సమద్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ ట్వీట్‌ వైరల్‌.. ఫ్యాన్స్‌ మాత్రం..

Fans Reacts SRH Tweet Carefully He Is HERO On Abdul Samad Last Ball 6 - Sakshi

IPL 2023- RR Vs SRH- Last Ball Thriller: ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయంతో ముగించింది. ఆఖరి బంతికి హైడ్రామా నెలకొన్న ఆదివారం నాటి మ్యాచ్‌లో ఊహించని రీతిలో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 214 పరుగుల భారీ టార్గెట్‌ను రైజర్స్‌ ఛేజ్‌ చేసే ఛాన్సే లేదన్న కామెంట్లు చేసిన వారి నోళ్లు మూయించింది.

అదృష్టం తోడు రాగా..
ఆటకు తోడు అదృష్టం కలిసి రావడంతో జైపూర్‌లో జయకేతనం ఎగురవేసి.. ఉప్పల్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లు అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌(33), అభిషేక్‌ శర్మ (55) మెరుగ్గా రాణించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి(47 పరుగులు) తన పాత్రకు న్యాయం చేశాడు.

మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పి
ఇక నాలుగో స్థానంలో వచ్చి హెన్రిచ్‌ క్లాసెన్‌ 12 బంతుల్లో 26 పరుగులతో మెరవగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్‌ ఫిలిప్స్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 7 బంతుల్లోనే 25 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.

సమద్‌ చేసెను అద్భుతం
ఇలా టాపార్డర్‌ బ్యాటర్లు తలా ఓ చెయ్యి వేసి మ్యాచ్‌ను చివరి వరకు లాక్కొనిరాగా.. ఆఖరి బంతికి అబ్దుల్‌ సమద్‌ కొట్టిన షాట్‌ ఆరెంజ్‌ ఆర్మీ ఆశలపై నీళ్లు చల్లింది. రాజస్తాన్‌ గెలిచిందన్న వార్త రైజర్స్‌ అభిమానుల గుండెలు బద్దలు చేసింది.

అంతలోనే నో బాల్‌ను సూచిస్తూ సిగ్నల్‌ రావడంతో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఫ్రీ హిట్‌ రూపంలో లభించిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న సమద్‌.. సందీప్‌ వేసిన యార్కర్‌ను సిక్సర్‌గా మలిచాడు. సన్‌రైజర్స్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. 

మొన్న జీరో.. ఇప్పుడు హీరో
దీంతో అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మొన్న జీరో.. ఇప్పుడు హీరో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌ తమ ఆటగాడు అబ్దుల్‌ సమద్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

జాగ్రత్త.. అతడు హీరో
అప్పటి వరకు ఓటమి ఖరారైందని తీవ్ర భావోద్వేగానికి లోనైన అభిషేక్‌ శర్మ సహా ఉమ్రాన్‌ మాలిక్‌ సహా డగౌట్‌లో కూర్చున్న వాళ్లంతా ఒక్కసారిగా దూసుకువచ్చి సమద్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఈ ఫొటోను షేర్‌ చేసిన రైజర్స్‌.. ‘‘జాగ్రత్త.. అతడు హీరో’’ అంటూ బాహుబలి సినిమాలో ప్రభాస్‌ను ఆత్మీయంగా తాకుతున్న చేతులు ఉన్న ఫొటోను కూడా ఇందులో జతచేసింది.

ఆరోజు అలా
దీంతో ఈ మ్యాచ్‌లో ఫిలిప్స్‌, సమద్‌ ఇద్దరు రియల్‌ హీరోలు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా కేకేఆర్‌తో గత మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమద్‌ 18 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో వరుణ్‌ చక్రవర్తి వేసి బంతినిసిక్స్‌ కొట్టే ఛాన్స్‌ ఉ‍న్నా మిస్‌ చేసి అవుటైన తీరుపై విమర్శలు వచ్చాయి.

కోట్లు కోట్లు తీసుకుని సరైన సమయంలో చేతులెత్తేస్తున్నాడంటూ ఫ్యాన్స్‌ కూడా ఫైర్‌ అయ్యారు. అయితే, రాజస్తాన్‌తో మ్యాచ్‌లో సీన్‌ రివర్స్‌ అయింది. సమద్‌ కొట్టిన సిక్సర్‌ అద్భుతం చేసింది. దీంతో తిట్టిననోళ్లే అతడిని పొగుడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 7 బంతులు ఎదుర్కొన్న సమద్‌ 17 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు.

చదవండి : నిమిషాల్లో అంతా తారుమారైంది.. వాళ్ల వల్లే గెలిచాం.. అయితే: మార్కరమ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top