IPL 2023- Dhoni: అతడిని కొనాలనుకున్నాం! కానీ.. ఆ విషయంలో ధోనిదే తుది నిర్ణయం

IPL 2023: CSK CEO Says Dhoni Happy Over Stokes Will Take Call On Captaincy - Sakshi

IPL 2023- Ben Stokes- MS Dhoni: ‘‘బెన్‌ స్టోక్స్‌ను దక్కించుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఎంఎస్‌ కూడా సూపర్‌ హ్యాపీ! వేలం జరుగుతున్నంత సేపు తన మాతో ఫోన్‌ కాల్‌లో టచ్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌ను సొంతం చేసుకోగలిగినందుకు ఎంఎస్‌ చాలా చాలా ఆనందంగా ఉన్నాడు’’ అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథ్‌ అన్నారు. 

ఐపీఎల్‌ మినీ వేలం-2023లో సీఎస్‌కే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు కోట్ల కనీస ధరంతో వేలంలోకి వచ్చిన ఈ సీనియర్‌ ఆల్‌రౌండర్‌ కోసం చెన్నై, లక్నో, ఆర్సీబీ, రాజస్తాన్‌, సన్‌రైజర్స్‌ పోటీ పడ్డాయి. చివరికి 16.25 కోట్లకు అతడిని చెన్నై దక్కించుకుంది.

ధోని ఎప్పుడంటే అప్పుడే!
దీంతో కెప్టెన్సీ విషయంలో సీఎస్‌కేకు ఏర్పడిన సమస్యలు తొలగినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ధోని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్‌ ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

స్టోక్స్‌ కెప్టెన్సీ ఆప్షన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే ఈ విషయంపై ధోనిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. ఇక వేలంలో భాగంగా సామ్‌ కరన్‌ లేదా స్టోక్స్‌ను దక్కించుకోవాలని వ్యూహాలు రచించామన్న కాశీ విశ్వనాథ్‌.. స్టోక్స్‌ను సొంతం చేసుకోవడంలో విజయవంతమైనందుకు సంతోషంగా ఉందన్నారు. 

అతడు కోలుకుంటున్నాడు
అదే విధంగా కైలీ జెమీసన్‌ గురించి ప్రశ్న ఎదురు కాగా.. ఈ కివీస్‌ ప్లేయర్‌ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడనే సమాచారం ఉందని, అందుకే అతడిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కాగా గత సీజన్‌లో మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పగ్గాలు చేపట్టాడు.

అయితే, అతడి సారథ్యంలో అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో మళ్లీ ధోనినే నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. . కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నైకి ఘోర పరాభవం తప్పలేదు. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. 

ఇక ఇప్పుడు స్టోక్స్‌ జట్టులోకి తిరిగి రావడంతో అతడిని కెప్టెన్‌గా సిద్ధం చేసి ధోని రిలాక్స్‌ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌కే సీఈవో ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చదవండి: IPL: సీఎస్‌కు కొనుగోలు చేసింది వీళ్లనే.. ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట
Ind Vs Ban: ఆలస్యమెందుకు.. ఆ షర్ట్‌ కూడా తీసెయ్‌! కోహ్లికి కోపం తెప్పించిన బంగ్లా బ్యాటర్‌ చర్యలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top