IPL 2022 MI Vs DC: అనామక బ్యాటర్స్‌తో అసాధ్యమే! మ్యాచ్‌ చేజారిందని అనుకున్నాం.. కానీ

IPL 2022: Delhi Capitals Beat Mumbai Indians Rishabh Pant Says Felt It Was Gone - Sakshi

లలిత్, అక్షర్‌ ధనాధన్‌...

గెలుపుపై స్పందించిన ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌

IPL 2022: Delhi Capitals Beat Mumbai Indians By 4 Wickets- ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌ ముందున్న లక్ష్యం 178 పరుగులు. కష్టమైందే! ముంబై బౌలర్లు బాసిల్‌ థంపి (3/35), మురుగన్‌ అశ్విన్‌ (2/14) విజృంభణతో ఢిల్లీ 10 ఓవర్లలో 77 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఇంకా నూటొక్క పరుగులు మిగతా 10 ఓవర్లలో... మిగిలిన అనామక బ్యాటర్స్‌తో అసాధ్యమే! కానీ లలిత్‌ యాదవ్‌ (38 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (17 బంతుల్లో 38 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధ్యం చేశారు.

ఏడో వికెట్‌కు 5 ఓవర్లలో 75 పరుగులు జోడించి మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ జట్టును నాలుగు వికెట్లతో గెలిపించారు. దీంతో ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌కు వరుసగా పదో ఏడాది ఐపీఎల్‌లో తాము ఆడిన  తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మొదట ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (48 బంతుల్లో 81 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన హైదరాబాద్‌ కుర్రాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు) రాణించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుల్దీప్‌ (3/18) తిప్పేయగా, ఖలీల్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీశాడు. ఢిల్లీ 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసి నెగ్గింది.  

చేజారిపోయిందనే అనుకున్నాం: పంత్‌
మొదటి మ్యాచ్‌లోనే ముంబై వంటి మేటి జట్టు మీద విజయం సాధించడం పట్ల ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ హర్షం వ్యక్తం చేశాడు. విజయానంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘వికెట్లు పడ్డా కొద్దీ మ్యాచ్‌ మా చేజారిపోయిందనే అనుకున్నాం. అదే సమయంలో ఏదో మూల చిన్న ఆశ. నమ్మకం. నిజానికి కీలక ప్లేయర్లు మార్ష్‌, వార్నర్‌ లేరు. మాకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే బరిలోకి దిగాము. కుల్దీప్‌ నిజంగా అత్యద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. నెట్స్‌లో తను ఎంతగా శ్రమించాడో మాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top