David Warner: సంతోషంగా ఉంది.. ఆ షాట్లు ఎలా ఆడాలో పంత్‌ను అడుగుతా: వార్నర్‌

IPL 2022: David Warner Wants To Learn This Shots From Rishabh Pant - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌-2022లో సరికొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. గత సీజన్‌లో ఘోర పరాభవం ఎదుర్కొన్న అతడు ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి ముందుకు నడవనున్నాడు. ఏ ఫ్రాంఛైజీతో తన ఐపీఎల్‌ జర్నీ మొదలుపెట్టాడో.. ప్రస్తుతం అదే గూటికి చేరుకున్నాడు.‍ పాకిస్తాన్‌ పర్యటన ముగించుకుని.. భారత్‌ చేరుకున్న వార్నర్‌ క్వారంటైన్‌ ముగించుకున్నాడు.

ఈ క్రమంలో లక్నో సూపర్‌జెయింట్స్‌ గురువారం(ఏప్రిల్‌ 7) జరిగే మ్యాచ్‌తో తాజా ఎడిషన్‌ను మొదలుపెట్టనున్నాడు. టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ సారథ్యంలో తొలిసారిగా ఆడనున్నాడు. ఈ సందర్భంగా వార్నర్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభంలో కీలక పాత్ర పోషించిన ఫ్రాంఛైజీకి తిరిగి రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. కొంత మంది పాత వాళ్లు ఉన్నారు. మరికొంత మంది కొత్తవాళ్లు.

వాళ్లతో కలిసి ఆడేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. సింగిల్‌ హ్యాండ్‌ షాట్లు ఎలా ఆడాలో రిషభ్‌ పంత్‌ను అడిగి తెలుసుకుంటా. టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన ఈ యువ క్రికెటర్‌ ఢిల్లీ కెప్టెన్‌గానూ విజయవంతమవుతున్నాడు. తనతో కలిసి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం కోసం ఎదురుచూస్తున్నా’’ అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో వైఫల్యం నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వార్నర్‌ను అవమానకర రీతిలో బయటకు పంపింది. ఇక ఆస్ట్రేలియాను టీ20 ప్రపంచకప్‌-2021 విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన వార్నర్‌ భాయ్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా వేలంలో భాగంగా ఢిల్లీ 6.25 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.  

చదవండి: IPL 2022: ఢిల్లీ జట్టుకు గుడ్‌న్యూస్‌.. యార్కర్ల కింగ్‌ రానున్నాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top