IPL 2022 CSK Vs LSG: 'Baby AB' Ayush Badoni Hits Spectator With Massive Six, Watch The Video - Sakshi
Sakshi News home page

CSK Vs LSG: బదోని భారీ షాట్‌... అమ్మ బాబోయ్‌.. ఆమె తలపగిలేదేమో!

Apr 1 2022 8:49 AM | Updated on Apr 1 2022 10:00 AM

IPL 2022 CSK Vs LSG: Ayush Badoni Six Hits Spectator During Match Viral - Sakshi

బదోని భారీ షాట్‌ (PC: Twitter/ Disney+ Hotstar)

IPL 2022 CSK Vs LSG: ఐపీఎల్‌లో తమ జట్టు తొలి విజయం నమోదు చేయాలంటే చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాలి.. ఇలాంటి సమయంలో తమ బేబీ ఏబీ డివిల్లియర్స్‌ క్రీజులో ఉన్నాడని కెప్టెన్‌ రాహుల్‌కు ధీమా.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 9 బంతుల్లో కీలకమైన 19 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు లక్నో సూపర్‌జెయింట్స్‌ ‘బేబీ ఏబీ’ ఆయుష్‌ బదోని. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 

ఇక 19వ ఓవర్‌ తొలి బంతికి బదోని కొట్టిన భారీ షాట్‌ క్రికెట్‌ ప్రియులను అలరించింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ రవీంద్ర జడేజా శివమ్‌ దూబేను రంగంలోకి దించగా.. అతడి బౌలింగ్‌లో తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు బదోని. దూబే షార్ట్‌ బాల్‌ సంధించగా... డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా షాట్‌ ఆడాడు. 

అయితే, బదోని ముచ్చటైన ఆట తీరును ఆస్వాదిస్తున్న వేళ ఓ అనూహ్య సంఘటన జరిగింది. స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌ వీక్షిస్తున్న ఓ మహిళ తలకు బంతి తగిలింది. దీంతో ఆమె పక్కనున్న వాళ్లంతా కాస్త కంగారు పడ్డారు. అయితే ఆమె ఫర్వాలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక ఆమె సీఎస్‌కేకు మద్దతుగా ఎల్లో జెర్సీ ధరించినట్లు కనిపిస్తుండటంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం ఆ లేడీ! తల పగిలేదేమో! ఏంటి బదోని గెలవాలన్న కసితో మంచి షాట్‌ ఆడావు..

కానీ ఆమెకు ఏమైనా అయ్యుంటే నీ తప్పు లేకపోయినా కాస్త బాధపడాల్సి వచ్చేది కదా! ఏదేమైనా మీరు తొలి విజయం అందుకున్నారు. కంగ్రాట్స్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌.. చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తొలిసారిగా గెలుపు రుచి చూసింది.

చదవండి: IPL 2022: కేఎల్‌ రాహుల్‌ ఎంత పని జరిగే.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement