స్వల్ప ఛేదనలో పంజాబ్‌ సునాయాస విజయం‌

IPL 2021: MI vs Punjab Kings Live Updates, Highlights - Sakshi

స్వల్ప ఛేదనలో పంజాబ్‌ సునాయాస విజయం
ఎట్టకేలకు పంజాబ్‌ జట్టు తిరిగి గెలుపు ట్రాక్‌ ఎక్కింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 132 పరగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్‌ రాహుల్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీకి(52 బంతుల్లో 60 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), గేల్‌ (35 బంతుల్లో 43 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. పంజాబ్‌ కోల్పోయిన ఒకే ఒక వికెట్‌ ముంబై బౌలర్‌ రాహుల్‌ చాహర్‌కు లభించింది. 

రాహుల్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ
పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు. వరుస పరాజయాల బాట పట్టిన తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్‌ ఎక్కించాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్‌ కెరీర్‌లో 24 అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అతని బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ పంజాబ్‌ను గెలుపు దిశగా పయనించేలా చేస్తుంది. 16.3 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 110/1. క్రీజ్లో రాహుల్‌కు(50 బంతుల్లో 50; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడుగా గేల్‌(30 బంతుల్లో 31; 4 ఫోర్లు, సిక్స్‌) ఉన్నాడు. పంజాబ్‌ గెలువాలంటే 21 బంతుల్లో  22 పరుగులు చేయాల్సి ఉంది.

లక్ష్యం దిశగా సాగుతున్న పంజాబ్‌ 
ప్రస్తుత సీజన్‌లో పంజాబ్‌ జట్టు రెండో గెలుపు దిశగా సాగుతోంది. ప్రత్యర్ధి ముంబై నిర్ధేశించిన 132 పరుగలు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేలా కనిపిస్తుంది. కెప్టెన్‌ రాహుల్‌ బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్‌ను నిర్మిస్తూ.. తన జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్నాడు. 13 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 82/1గా ఉంది. క్రీజ్‌లో రాహుల్‌(39), గేల్‌(17) ఉన్నారు. పంజాబ్‌ గెలుపునకు 42 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి ఉంది.

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌.. మయాంక్‌(25) ఔట్‌
దూకుడుగా ఆడుతున్న పంజాబ్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను(20 బంతుల్లో 25; 4 ఫోర్లు, సిక్స్‌) రాహుల్‌ చాహర్‌ బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న సమయంలో మయాంక్‌ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి.. లాంగ్‌ ఆన్‌ ఫీల్డర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 7.2 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 53/1. క్రీజ్‌లో రాహుల్‌కు(28) జతగా గేల్‌ వచ్చాడు.  

దూకుడుగా ఆడుతున్న పంజాబ్‌ 
132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. కేఎల్‌ రాహుల్‌(15 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్‌), మయాంక్‌ అగర్వాల్‌లు(10 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్‌) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్‌ బోర్డును వడివడిగా ముందుకు తీసుకెళ్తున్నారు. వీరి ధాటికి 5 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 40/0గా ఉంది.  

పంజాబ్‌ టార్గెట్‌ 132
ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డ ముంబై జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. ఆఖరి బంతిని ఎదుర్కొన్న పోలార్డ్‌(12 బంతుల్లో 16; సిక్స్‌) కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. జయంత్‌ యాదవ్‌ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా ఉన్నాడు.పంజాబ్‌ బౌలర్లలో బిష్ణోయి 2, షమీ 2, అర్ష్‌దీప్‌,దీపక్‌ హూడా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

కృనాల్(3)‌ ఔట్
త్వరగా పరుగులు రాబట్టే క్రమంలో ముంబై జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది.‌ ఇన్నింగ్స్‌ మరో బంతితో ముగుస్తుందనగా కృనాల్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. 3 బంతుల్లో 3 పరుగులు చేసిన కృనాల్‌ షమీ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.19.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 130/6. 

ఐదో వికెట్‌ కోల్పోయిన ముంబై, హార్ధిక్‌(1) ఔట్
పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తూ.. హార్ధిక్‌ ఔటయ్యాడు. ఆర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి దీపక్‌ హూడా చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 18.4 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 122/5. క్రీజ్‌లో పోలార్డ్‌(10), కృనాల్‌(0) ఉన్నారు.

రోహిత్‌(63) ఔట్‌‌..17.3 ఓవర్ల తర్వాత ముంబై 112/4
ఇన్నింగ్స్‌ చివరిదాకా క్రీజ్‌లో ఉంటాడని భావించిన రోహిత్‌ శర్మను(52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) షమీ బోల్తా కొట్టించాడు. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఫేబియన్‌ అలెన్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ వెనుదిరిగాడు. 17.3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 112/4. క్రీజ్‌లోకి హార్ధిక్‌ పాండ్యా వచ్చాడు.

సూర్యకుమార్‌(33) ఔట్
రవి బిష్ణోయి బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నంలో సూర్యకుమార్‌ ఔటయ్యాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 33 పరుగులు చేసిన సూర్యకుమార్‌... క్రిస్‌ గేల్‌ చేతికి సింపుల్‌ క్యాచ్‌ అందించి వెనుదిరిగాడు. 16.1 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 105/3. క్రీజ్‌లో రోహిత్‌కు(48 బంతుల్లో 62) జతగా పోలార్డ్‌ వచ్చాడు. 

రోహిత్‌ హాఫ్‌ సెంచరీ
ప్రస్తుత సీజన్‌లో రోహిత్‌ ఎట్టకేలకు హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన ముంబై కెప్టెన్‌.. 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఐపీఎల్‌లో 40వ ఫిఫ్టీని నమోదు చేశాడు. 13.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 81/2. క్రీజ్‌లో రోహిత్‌కు జతగా సూర్యకుమార్‌ యాదవ్‌(18 బంతుల్లో 20; ఫోర్‌, సిక్స్‌) ఉన్నాడు.

ముంబై సెకెండ్‌ వికెట్‌ డౌన్‌.. ఇషాన్‌ కిషన్‌(6) ఔట్‌
రవి బిష్ణోయి వేసిన 7వ ఓవర్‌ ఆఖరి బంతికి ఇషాన్‌ కిషన్‌(17 బంతుల్లో 6) ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ ఇషాన్‌...బిష్ణోయి బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. 7 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 26/2. క్రీజ్‌లో రోహిత్‌(20 బంతుల్లో 17),  సూర్యకుమార్‌(0) ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై.. డికాక్‌(3) ఔట్
ప్రస్తుత సీజన్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న డికాక్‌(5 బంతుల్లో 3 )మరోసారి నిరాశపరిచాడు. దీపక్‌ హూడా వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో మిడాన్‌లో ఉన్న హెన్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. 2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 7/1. క్రీజ్‌లో రోహిత్‌(7 బంతుల్లో 4), ఇషాన్‌ కిషన్‌(0) ఉన్నారు.

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌  కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌‌ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ ఇరు జట్లు  26 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా, ముంబై ఇండియన్స్‌ 14 సార్లు, పంజాబ్‌ కింగ్స్‌ 12 సందర్భాల్లో విజయం సాధించాయి. ఇక ఇరు జట్లు తలపడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో ముంబై మూడింట, పంజాబ్‌ రెండింట గెలుపొందాయి. దుబాయ్‌ వేదికగా జరిగిన గత సీజన్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించాయి. ఆ సీజన్‌లో ఇరు జట్లు తలపడిన తొలి అంచె మ్యాచ్‌లో  ముంబై 48 పరుగుల తేడాతో విజయాన్ని అందుకోగా, రెండో అంచె మ్యాచ్‌లో  పంజాబ్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు సూపర్‌ ఓవర్ల తర్వాత విజేత ఎవరో తేలడం విశేషం. 

పంజాబ్‌ కింగ్స్‌: కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌)‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, పూరన్‌‌, దీపక్‌ హూడా, షారుఖ్‌ ఖాన్‌, ఫాబియన్‌ అలెన్‌, మెయిసిస్‌ హెన్రిక్స్, షమీ, రవి బిష్ణోయి, అర్షదీప్‌ సింగ్‌

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్‌ డికాక్‌‌, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జయంత్‌ యాదవ్‌, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top