క్రిస్‌ గేల్‌ డైవ్‌కు రసెల్‌ నవ్వులే నవ్వులు

IPL 2 021: Gayles Diving Attempt Leaves Andre Russell In Splits - Sakshi

అహ్మదాబాద్‌:  క్రికెట్‌లో కొంతమంది బ్యాటింగ్‌ వరకే పరిమితమైతే, మరికొంతమంది బౌలింగ్‌ వరకే ఉంటారు. మరి బ్యాటింగ్‌కే పరిమితమయ్యే బ్యాటర్స్‌ కానీ బౌలింగ్‌కే పరిమితమయ్యే బౌలర్లు కానీ ఫీల్డింగ్‌లో అసాధారణ విన్యాసాలు కాకుండా సాధారణ విన్యాసాలు చేసినా విపరీతమైన నవ్వు రావడం ఖాయం. అందుకు నిన్న పంజాబ్‌ కింగ్స్‌- కేకేఆర్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచే ఉదాహరణ. సాధారణంగా ఫీల్డింగ్‌లో పెద్దగా ఆకట్టుకోని గేల్‌.. ఈ మ్యాచ్‌లో డైవ్‌ కొట్టి అందరిలో నవ్వులు పూయించాడు.  ఫీల్డింగ్‌ విన్యాసాలు పెద్దగా చేయని గేల్‌.. ఏకంగా జాంటీ రోడ్స్‌ తరహాలో డైవ్‌ కొట్టి మరీ బంతిని ఆపేశాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఛేజింగ్‌ చేసే సమయంలో  జోర్డాన్‌ వేసిన ఓ ఫుల్లర్‌ డెలివరీని స్ట్రైకింగ్‌లో ఉన్న రాహుల్‌ త్రిపాఠి మిడ్‌ వికెట్‌వైపు ఆడాడు. కానీ అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న గేల్‌ డైవ్‌ కొట్టి మరీ బంతిని ఆపేశాడు. దీనికి డగౌట్‌లో ఉన్న ఆండ్రీ రసెల్‌ తెగ నవ్వుకున్నాడు. అప్పటివరకూ సీరియస్‌గా ఉన్న రసెల్‌.. గేల్‌ డైవ్‌తో అసలు నవ్వును ఆపులేకపోయాడు. చేతిని అడ్డం పెట్టుకుని మరీ నవ్వుకున్నాడు. కామెంటేటర్లు కూడా రోడ్స్‌ డైవ్‌లా ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌కు రోడ్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. గేల్‌ డైవ్‌, రసెల్‌ నవ్వులు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత  మరో విజయాన్ని కేకేఆర్‌ సాధించింది.. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ 47 పరుగులు నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. త్రిపాఠి 41 పరుగులతో ఆ‍కట్టుకున్నాడు.

ఇక్కడ చదవండి: అక్కడ ఆడటానికి వెళ్లని మీరు.. ఐపీఎల్‌కు ఎలా వచ్చారు?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top