మాకు చార‍్టర్‌ విమానం వేయండి: సీఏకు లిన్‌ విజ్ఞప్తి

IPL 2021: Chris Lynn Urges Cricket Australia For Charter Plane For Players - Sakshi

ఢిల్లీ: తమకు వచ్చేవారం కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ క్రిస్‌ లిన్‌ స్ప‘ష్టం చేశాడు. ఈ విషయాన్ని మంగళవారం న్యూకార్పోరేషన్‌ మీడియాకు తెలిపిన లిన్‌..  క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)కు చార్టర్‌ ప్లేన్‌ వేయమని విజ్ఞప్తి చేసినట్లు తెలిపాడు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత తామంతా(ఆస్ట్రేలియా క్రికెటర్లు) క్షేమంగా స్వదేశానికి వచ్చేందుకు చార్టర్‌ విమానాన్ని వేయమని కోరినట్లు తెలిపాడు. ‘సీఏకు టెక్స్ట్‌ మెసేజ్‌ చేశాను. ప్రతీ ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ద్వారా సీఏ 10 శాతం డబ్బును సంపాదిస్తుంది.  

ఇప్పుడు ఆ డబ్బును మాకు చార్టర్‌ విమానం వేయడానికి ఖర్చు చేస్తుందనే భావిస్తున్నా. మా కంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము కఠినమైన బయోబబుల్‌లో ఉంటున్నాము. వచ్చేవారం వ్యాక్సిన్‌ కూడా వేయించుకుంటాము. దాంతో మమ్మల్ని టోర్నీ ముగిసిన తర్వాత చార్టర్‌ విమానం ద్వారా ఇంటికి చేరుస్తారని ఆశిస్తున్నా.  మేము షార్ట్‌ కట్‌లు గురించి అడగడం లేదు. మేము సంతకాలు చేసేటప్పుడే రిస్క్‌ తెలుసుకునే చేశాం. ఈ మెగా టోర్నీ పూర్తయి ఎంత తొందరగా ఇంటికి క్షేమంగా చేరుకుంటే అంత కంటే మంచిది మరొకటి ఉండదు’ అని లిన్‌ తెలిపాడు.

ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియా క్రికెటర్‌, కేకేఆర్‌ సభ్యుడు ప్యాట్‌ కమిన్స్‌ .. పీఎం కేర్స్‌కు 50వేల యూఎస్‌ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.భారత్‌లో కరోనా రోగులకు ఆక్సిజన్‌ సప్లయ్‌ కొరత ఉన్న కారణంగా తనవంతు విరాళాన్ని ప్రకటించాడు. అదే సమయంలో ఐపీఎల్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న మిగిలిన ఆసీస్‌ క్రికెటర్లను కూడా సాయం చేయాలని కోరాడు. కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం నాటికి కోవిడ్‌ కేసుల అప్‌డేట్‌ విడుదల చేసే సమయానికి గత 24 గంటల్లో 3, 23,144 కొత్త కేసులు నమోదు కాగా, 2,771 మృత్యువాత పడ్డారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top