
ఐపీఎల్ ఒకప్పటిలా జరగకపోవచ్చు కానీ... ఎప్పటిలాగే అభిమానుల్ని అలరించడం మాత్రం పక్కా..
ముంబై: ఈ సారి బయో బబుల్‌లో జరిగే ఐపీఎల్ ఆటగాళ్లకు భిన్నమైన సవాల్ అని ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు, భారత క్రికెటర్ అజింక్య రహానే అన్నాడు. ‘సందేహం లేదు. ఈ సీజన్ ప్రతి ఒక్కరికి విభిన్నమైంది. పెను సవాళ్లు ఎదురవుతాయి. నేను కొన్నాళ్లుగా శారీరక ఫిట్‌నెస్‌తో పాటు మానసిక స్థైర్యంపై కూడా కసరత్తులు చేశాను. ముఖ్యంగా నెలల పాటు కుటుంబ సభ్యులతోనే గడపడం ద్వారా నాలో సానుకూల దృక్పథం పెరిగింది’ అని అన్నాడు. ఇతని సహచరుడు, యువ ఆటగాడు పృథ్వీ షా మాట్లాడుతూ నాలుగైదు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితమైన తమకు ఈ మహమ్మారి వల్ల ఏం చేయాలి, ఏం చేయకూడదోనన్న సంపూర్ణ అవగాహన ఉందని, దీంతో ఇతరత్రా ఆలోచనలు లేకుండా ఆటపైనే దృష్టి పెట్టే మానసిక సత్తా ఉందని అన్నాడు. (ఐపీఎల్ సందడి షురూ...)
మునుపటిలా ఉండదు: దినేశ్ కార్తీక్
దుబాయ్: ఐపీఎల్ ఒకప్పటిలా జరగకపోవచ్చు కానీ... ఎప్పటిలాగే అభిమానుల్ని అలరించడం మాత్రం పక్కా అని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ‘ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ ఆట సవాలుతో కూడుకున్నది. అందుకే ఈ ఐపీఎల్ మునుపటి సీజన్లు జరిగినట్లుగా ఉండదు. కచ్చితంగా భిన్నంగానే ఉంటుంది. అయితే ఆట మొదలుపెడితే అభిమానుల్ని అలరిస్తూనే ఉంటాం. జీవ రక్షణ వలయం (బయో బబుల్)లో ఆడటం కొత్త. ఇలా మనం వెళ్లే దారిలో సమస్యలు ఉన్నాయి. కానీ వీటన్నింటిని అధిగమిస్తాం, రాణిస్తాం’ అని అన్నాడు. (ఐపీఎల్ క్వారంటైన్: బాల్కనీలో బాతాఖానీ...)