
గిల్ రికార్డు సెంచరీ
7 వికెట్ల దూరంలో టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌లో 427/6 డిక్లేర్డ్
మెరిసిన పంత్, జడేజా, ఆకాశ్‌దీప్
ఇంగ్లండ్ లక్ష్యం 608... ప్రస్తుతం 72/3
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా విజయం వాకిట్లో నిలిచింది. బ్యాటర్ల అసమాన ప్రదర్శనకు బౌలర్ల సహకారం తోడవడంతో భారీ విజయంపై కన్నేసింది. గిల్ రికార్డు శతకానికి పంత్, జడేజా, రాహుల్ హాఫ్ సెంచరీలు జతవడంతో ఆతిథ్య జట్టు ముందు కొండంత లక్ష్యం నిలవగా... 608 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విజయానికి ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉండగా... ఇక్కడి నుంచి ఆ జట్టు గెలవాలంటే మహాద్భుతం జరగాల్సిందే! భారత బౌలర్ల జోరు చూస్తుంటే ఆదివారం వేగంగా ఏడు వికెట్లు తీయడం ఖాయంగా అనిపిస్తుండగా... రోజంతా వర్షం కురవాలని ప్రార్థించడం తప్ప ఇంగ్లండ్ ముందు మరో అవకాశం కనిపించడం లేదు!
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో దంచి కొట్టిన టీమిండియా... ప్రత్యర్థి ముందు ఏకంగా 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత స్కోరును చేరుకునే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రాలీ (0), డకెట్ (15 బంతుల్లో 25; 5 ఫోర్లు), రూట్ (6) పెవిలియన్ చేరగా... పోప్ (24 బ్యాటింగ్; 3 ఫోర్లు), బ్రూక్ (15 బ్యాటింగ్; 2 ఫోర్లు) పోరాడుతున్నారు.
భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. ఆదివారం ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు... విజయానికి ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 64/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 83 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో, యువ సారథి శుబ్‌మన్ గిల్ (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) మరో శతకంతో కదం తొక్కాడు.
రవీంద్ర జడేజా (118 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (58 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (84 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. ఈ క్రమంలో టీమిండియా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక (1014) స్కోరు నమోదు చేసుకోగా... గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 430 పరుగులతో విజృంభించాడు.
పంత్ ఫటాఫట్...
గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా... పరాజయం పాలైన టీమిండియా ఈ సారి ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపించింది. నాలుగో రోజు తొలి సెషన్ ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదురైనా... వాటిని అధిగమించి భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో పరుగుల రాక కష్టం కాగా... కరుణ్ నాయర్ (26; 5 ఫోర్లు) మరోసారి మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్నాడు. కాసేపటికి అర్ధశతకం అనంతరం రాహుల్ కూడా వెనుదిరగగా... పంత్ వచ్చిరావడంతో విరుచుకుపడ్డాడు.
ఎదుర్కొన్న మూడో నాలుగు బంతులకు వరుసగా 4, 6 కొట్టి తన ఉద్దేశం చాటాడు. అతడి దూకుడుకు ఇంగ్లండ్ పేలవ ఫీల్డింగ్ కూడా తోడ్పడింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్‌ను క్రాలీ అందుకోలేకపోయాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతడు... తదుపరి ఓవర్‌లో మరో 4, 6 బాదాడు. బషీర్‌కు రెండు ఫోర్లతో స్వాగతం పలికిన పంత్... చిత్రవిచిత్రమైన షాట్లతో చెలరేగిపోయాడు. దీంతో తొలి సెషన్‌లో భారత్ 25 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.
గిల్ నిలకడ...
రెండో సెషన్‌లో పంత్‌తో పాటు గిల్ కూడా దంచి కొట్టడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. టంగ్ బౌలింగ్‌లో 6, 4, 4 కొట్టిన గిల్.. అతడి తదుపరి ఓవర్‌లో మరో 6, 4తో 57 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పంత్ 48 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. స్కోరు పెంచే క్రమంలో పంత్ ఔట్ కాగా... జడేజా రాకతో పరుగుల వేగం మందగించింది. ఈ మధ్యలో కొన్ని చక్కటి షాట్లతో అలరించిన గిల్ 129 బంతుల్లో మ్యాచ్‌లో రెండో సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు.
రెండో సెషన్‌లో టీమిండియా 30 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. ఇక మూడో సెషన్‌లో గిల్, జడేజా దుమ్మురేపారు. బంతి తమ పరిధిలో ఉంటే చాలు దానిపై విరుచుకుపడిన ఈ జంట స్కోరు బోర్డుకు రాకెట్ వేగాన్నిచ్చింది. వోక్స్ ఓవర్‌లో గిల్ 6, 4, 4తో చెలరేగాడు. మరోవైపు జడేజా కూడా మ్యాచ్‌లో రెండో అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. రూట్ బౌలింగ్ 6, 4తో గిల్ 150 పరుగుల మార్క్ అందుకున్నాడు.

పంత్‌తో నాలుగో వికెట్‌కు 110 పరుగులు జోడించిన గిల్... జడేజాతో ఐదో వికెట్‌కు 175 పరుగులు జతచేశాడు. ఎట్టకేలకు బషీర్ బౌలింగ్‌లో గిల్ ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. వాషింగ్టన్ సుందర్ (12 నాటౌట్) అండతో జడేజా జట్టు ఆధిక్యాన్ని 607కు చేర్చాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 587; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) టంగ్ 28; రాహుల్ (బి) టంగ్ 55; నాయర్ (సి) స్మిత్ (బి) కార్స్ 26; గిల్ (సి అండ్ బి) బషీర్ 161; పంత్ (సి) డకెట్ (బి) బషీర్ 65; జడేజా (నాటౌట్) 69; నితీశ్ రెడ్డి (సి) క్రాలీ (బి) రూట్ 1; సుందర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (83 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 427. వికెట్ల పతనం: 1–51, 2–96, 3–126, 4–236, 5–411, 6–412. బౌలింగ్: వోక్స్ 14–3–61–0; కార్స్ 12–2–56–1; టంగ్ 15–2–93–2; స్టోక్స్ 7–1–26–0; బషీర్ 26–1–119–2; రూట్ 9–1–65–1.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్‌దీప్ 25; క్రాలీ (సి) (సబ్) సుదర్శన్ (బి) సిరాజ్ 0; పోప్ (బ్యాటింగ్) 24; రూట్ (బి) ఆకాశ్‌దీప్ 6; బ్రూక్ (బ్యాటింగ్) 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 72. వికెట్ల పతనం: 1–11, 2–30, 3–50, బౌలింగ్: ఆకాశ్‌దీప్ 8–1–36–2; సిరాజ్ 5–1–29–1; ప్రసిధ్ కృష్ణ 3–0–6–0.
430 ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి గిల్ చేసిన పరుగులు. భారత్ తరఫున ఇదే అత్యధికం. సునీల్ గావస్కర్ (344; 1971లో వెస్టిండీస్‌పై)ను అతను అధిగమించాడు. ఓవరాల్‌గా గూచ్ (456; 1990లో భారత్‌పై) అగ్ర స్థానంలో ఉండగా... గిల్ రెండో స్థానంలో నిలిచాడు.
1014 ఈ మ్యాచ్‌లో భారత్ చేసిన పరుగులు. మన టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికం. 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగుల స్కోరును టీమ్ దాటింది.
2 ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. గతంలో సునీల్ గావస్కర్ ఒక్కడే ఈ ఘనత సాధించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 150+స్కోర్లు చేసిన రెండో బ్యాటర్‌గాను గిల్ నిలిచాడు. గతంలో అలెన్ బోర్డర్ ఈ ఫీట్ నమోదు చేశాడు.