KL Rahul: క్లాసిక్‌ సెంచరీ.. విమర్శకుల నోళ్లు మూయించాడుగా..! | India Vs England 2nd ODI KL Rahul Century Twitter Applauds Him | Sakshi
Sakshi News home page

అద్భుత సెంచరీ.. విమర్శకుల నోళ్లు మూయించాడుగా!

Mar 26 2021 6:24 PM | Updated on Mar 26 2021 7:11 PM

India Vs England 2nd ODI KL Rahul Century Twitter Applauds Him - Sakshi

టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని, మనల్ని కిందకి లాగాలని చూసే వాళ్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని చెప్పేందుకే అలా చేస్తానని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

పుణె: ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌ తిరిగి ఫాంలోకి వచ్చాడు. తొలి రెండు వన్డేల్లో అతడు నమోదు చేసిన స్కోర్లే ఇందుకు నిదర్శనం. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు వరుసగా 1,0,0,14. దీంతో రాహుల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్‌ నేపథ్యంలో, మరో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను కాదని తొలి మ్యాచ్‌లో అతడిని జట్టులోకి తీసుకోవడం పట్ల కూడా చాలా మంది పెదవి విరిచారు. 

అయితే, ఈ విమర్శలన్నింటికీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు ఈ కర్ణాట​క బ్యాట్స్‌మెన్‌. మొదటి వన్డేలో హాఫ్‌ సెంచరీ(43 బంతుల్లో 62 పరుగులు, 4 ఫోర్లు, 4 సిక్సర్లు, నాటౌట్‌)తో సత్తా చాటిన కేఎల్‌ రాహుల్‌, శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో క్లాసిక్‌ సెంచరీతో(114 బంతుల్లో 108 పరుగులు- 7 ఫోర్లు, 2 సిక్సర్లు ) తన విలువేమిటో నిరూపించుకున్నాడు. వన్డే కెరీర్‌లో ఇది అతడికి ఐదో సెంచరీ. దీంతో టీమిండియా మాజీ ఆటగాళ్లు, నెటిజన్లు కేఎల్‌ రాహుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నీ షాట్‌ సెలక్షన్‌ అద్భుతం
‘‘చాలా బాగా ఆడావ్‌ రాహుల్‌. అద్భుతమైన సెంచరీ. నీ షాట్‌ సెలక్షన్‌ ఎంతగానో నచ్చింది. ఇన్నింగ్స్‌ ఆడిన తీరు అమోఘం. ఇక ముందు కూడా ఇలాగే ఆడాలి’’ అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ కొనియాడాడు. ఇక ఇర్ఫాన్‌ పఠాన్‌.. ‘‘విలక్షణమైన బ్యాట్స్‌మెన్‌ నుంచి టాప్‌ క్లాస్‌ 100’’ అంటూ ప్రశంసించాడు. ‘‘కేఎల్‌ రాహుల్‌ సాధించిన సెంచరీ జట్టుకు ఎంతో అవసరం. వన్డేల్లో నంబర్‌ 4 స్థానంలో వచ్చిన ఆటగాడు శతకం నమోదు చేయడం ఎంతో ప్రత్యేకం’’ అని ఆర్పీ సింగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వసీం జాఫర్‌.. టాప్‌ ఇన్నింగ్స్‌ ఆడిన ప్రతిసారి రాహుల్‌ సెలబ్రేట్‌ చేసుకునే విధానానికి సంబంధించిన ఫొటోను షేర్‌ చేసి, ఇదే నా ట్వీట్‌ అంటూ తనదైన శైలిలో కామెంట్‌ చేశాడు. 

ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశం లేదు: కేఎల్‌ రాహుల్‌
రాహుల్‌ ఫ్యాన్స్‌ సైతం.. ‘‘ఇదిగో విమర్శలకు ఇలా సమాధానం ఇచ్చాడు. వారి నోరు మూయించాడు’’ అంటూ ఇదే తరహా ఫొటోను పంచుకుంటున్నారు. కాగా సెంచరీ చేయగానే ఎప్పటిమాదిరిగానే చెవులు మూసుకుని రాహుల్‌ తనదైన శైలిలో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని, మనల్ని కిందకి లాగాలని చూసే వాళ్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని చెప్పేందుకే అలా చేస్తానని చెప్పుకొచ్చాడు. తిరిగి ఫాంలోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో రాహుల్‌, కెప్టెన్‌ కోహ్లి, పంత్‌తో కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

చదవండి: కోహ్లి అరుదైన రికార్డు.. ఎవరికీ అందనంత దూరంలో!
ఎంతైనా టీమిండియా వికెట్‌ కీపర్లు బెస్ట్‌ బేబీసిట్టర్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement