Shikhar Dhawan: ప్రపంచకప్‌ జట్టులో ధావన్‌ ఉండాలి! అవసరం లేదు!

Ind Vs WI: Reetinder Sodhi Lauds Dhawan Why Not Shikhar For T20 WC 2022 - Sakshi

India Tour Of West Indies 2022- ODI Series- 3rd ODI: టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌పై భారత మాజీ క్రికెటర్‌ రితీందర్‌ సింగ్‌ సోధి ప్రశంసలు కురిపించాడు. బ్యాట్‌తో రాణిస్తున్న గబ్బర్‌.. ఫీల్డింగ్‌ నైపుణ్యాలతోనూ ఆకట్టుకుంటున్నాడని కొనియాడాడు. వన్డే ప్రపంచకప్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలోనూ ఆడే అర్హత అతడికి ఉందని అభిప్రాయపడ్డాడు.

కాగా వన్డే ఫార్మాట్‌లో ధావన్‌ నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. యువ బ్యాటర్లు దూసుకువస్తున్నా.. గత రెండేళ్లలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తొమ్మిది హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్‌లోనూ గబ్బర్‌ మెరుగ్గానే రాణిస్తున్నాడు. ఐపీఎల్‌-2022లో అతడు పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

ఆడిన‌ 14 ఇన్నింగ్స్‌లో 460 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ధావన్‌ అత్యధిక స్కోరు 88 నాటౌట్‌. అయినప్పటికీ అతడికి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌ జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ధావన్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు.

కెప్టెన్‌గానే కాదు.. బ్యాటర్‌గా కూడా!
ఇంగ్లండ్‌లో పెద్దగా రాణించలేకపోయినా.. అనూహ్యంగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో యువ జట్టును ముందుకు నడిపించి విండీస్‌ గడ్డ మీద ఆతిథ్య జట్టును 3-0తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించాడు.

కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ సఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో మొత్తంగా 168(97, 13, 58) పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రితీందర్‌ సింగ్‌ సోధి ధావన్‌ ఆట తీరును కొనియాడాడు. ఈ మేరకు ఇండియా న్యూస్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఈ మాజీ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. ‘‘50 ఓవర్ల వరల్డ్‌కప్‌(వన్డే ప్రపంచకప్‌) గురించి మాట్లాడినపుడు మాత్రమే ధావన్‌ పేరు ప్రస్తావనకు వస్తోంది.

మరి టీ20 వరల్డ్‌కప్‌ విషయంలో అతడి పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? అనువజ్ఞుడైన ఆటగాడిగా.. మైదానంలో పాదరసంలా కదులుతూ ఆకట్టుకుంటున్న ధావన్‌ కూడా జట్టులో స్థానం కోసం పోటీపడగలడు కదా! కొన్ని నెలల క్రితం అతడి ఊసే ఎవరూ ఎత్తలేదు. కానీ ఇప్పుడు వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌గా వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్న తీరు అద్భుతం’’ అని ప్రశంసించాడు.

అవసరం లేదు!
టీ20 ప్రపంచకప్‌-2022లో భారత జట్టు ప్రణాళికల్లో ధావన్‌ కూడా ఉంటే బాగుంటుందని, అతడికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా రితీందర్‌ సింగ్‌.. సీసీఐకి సూచించాడు. అయితే, మాజీ సెలక్టర్‌ సబా కరీం మాత్రం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ధావన్‌ అవసరం ఎక్కువగా ఉందని పేర్కొనడం గమనార్హం. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ ఆరంభం కానుంది. అదే విధంగా వన్డే వరల్డ్‌కప్‌ ఈవెంట్‌-2023కి భారత్‌ వేదిక కానున్న విషయం తెలిసిందే.

చదవండి: Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్‌.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?!
World Cup 2023: అందుకే గబ్బర్‌ కెప్టెన్‌ అయ్యాడు! రోహిత్‌ శర్మ కోరుకుంటున్నది అదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top