KL Rahul: అంత సులువేమీ కాదు.. కష్టపడ్డాం.. గెలిచాం! కాస్త రిలాక్సైన తర్వాతే..

Ind Vs Ban 1st Test KL Rahul: We Really Work Hard For This Win Happy - Sakshi

Bangladesh vs India, 1st Test: ‘‘వన్డే సిరీస్‌లో అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాం. అయితే, టెస్టు సిరీస్‌ను విజయంతో ఆరంభించడం సంతోషంగా ఉంది. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ గెలుపు సాధ్యమైంది. నిజానికి ఈ పిచ్‌పై మొదటి మూడు రోజులు పరుగులు రాబట్టడం కష్టంగా తోచింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఓపెనర్లు బ్యాటింగ్‌ చేసిన విధానం మా బౌలర్లపై బాధ్యత మరింత పెంచింది. అంత సులువుగా వికెట్లు తీయడం సాధ్యం కాదని, అంత తేలికగా విజయం దక్కదని అర్థమైంది. 

అయితే, మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో 400 ప్లస్‌ స్కోరు చేయడం బ్యాటర్ల ప్రతిభకు నిదర్శనం. పుజీ, శ్రేయస్‌, రిషభ్‌ మెరుగ్గా రాణించారు. చాలా చాలా సంతోషంగా ఉంది. టెస్టు మ్యాచ్‌ గెలవడం కంటే సంతోషం ఇంకొకటి ఉండదు. రెండు రోజుల పాటు కాస్త రిలాక్స్‌ అయి తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతాం’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ హర్షం వ్యక్తం చేశాడు. 

కాగా వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్‌ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 188 పరుగుల తేడాతో గెలుపొందిన రాహుల్‌ సేన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఈ నేపథ్యంలో సారథి రాహుల్‌ మాట్లాడుతూ ఈ గెలుపును సమిష్టి కృషిగా అభివర్ణించాడు. అయితే, ఈ విజయం కోసం బాగా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

టీమిండియా గెలిచిందిలా...
వన్డే సిరీస్‌ను పరాజయంతో మొదలుపెట్టిన భారత్‌... ఆఖరి టెస్టు ఓడినా కూడా సిరీస్‌ కోల్పోని పటిష్టస్థితిలో టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. మొదటి టెస్టు ఆఖరి రోజు లాంఛనం లంచ్‌లోపే ముగిసింది. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 113.2 ఓవర్లలో 324 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో భారత్‌ 188 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 

ఓవర్‌నైట్‌ స్కోరు 272/6తో చివరి రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌ 11.2 ఓవర్లు మాత్రమే ఆడి 52 పరుగులు జతచేసి మిగితా నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ (84; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడినంతసేపు ధాటిగా ఆడాడు. ఆట మొదలైన కాసేపటికే ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ మెహిదీ హసన్‌ మిరాజ్‌ (13)ను పేసర్‌ సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. స్పెషలిస్టు బ్యాటర్లు ఇంకెవరూ లేకపోవడంతో మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ షకీబ్‌ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 80 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

తైజుల్‌ (4)తో కలిసి జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. అయితే తన వరుస ఓవర్లలో కుల్దీప్‌... షకీబ్, ఇబాదత్‌ (0)లను అవుట్‌ చేశాడు. తైజుల్‌ను అక్షర్‌ పటేల్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో బంగ్లా రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. చివరి రోజు ఆటలో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/73) రెండు వికెట్లు పడేయగా, మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ (4/77), సీమర్‌ సిరాజ్‌ (1/67) చెరో వికెట్‌ తీశారు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ కలుపుకొని ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ కుల్దీప్‌ (8/113) కెరీర్‌ బెస్ట్‌ గణాంకాలు నమోదు చేశాడు. ఈ నెల 22 నుంచి మిర్పూర్‌ వేదికపై చివరిదైన రెండో టెస్టు జరుగుతుంది. 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: 404 & 258/2 డిక్లేర్డ్‌
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: 150 & 324

చదవండి: FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు
FIFA WC 2022: వారెవ్వా అర్జెంటీనా.. మూడోసారి, మూడో స్థానం, మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top