IND VS AUS 1st Test: చరిత్ర సృష్టించిన నాథన్‌ లయోన్‌.. నో బాల్‌ వేయకుండా 30,000 బంతులు

IND VS AUS 1st Test: Nathan Lyon Achieves Unique Feat, Bowls 30000 Deliveries Without A No Ball - Sakshi

146 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. ఆసీస్‌ వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌ ఈ అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్‌లో లయోన్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇంతకీ లయోన్‌ సాధించిన ఆ రికార్డు ఏంటంటే.. 

1877లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి అధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ మొదలైన నాటి నుంచి నేటి వరకు ఒకే ఒక్క బౌలర్‌ (కనీసం 100 టెస్ట్‌లు ఆడిన క్రికెటర్‌) టెస్ట్‌ల్లో కనీసం ఒక్క నో బాల్‌ కూడా వేయకుండా 30,000 బంతులను బౌల్‌ చేశాడు. ఆ మహానుభావుడే నాథన్‌ లయోన్‌. 2011లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్ట్‌ అరంగేట్రం చేసిన లయోన్‌.. ఇప్పటివరకు 115 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 460 వికెట్లను పడగొట్టాడు.

12 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన లయోన్‌ ఒక్కసారి కూడా క్రీజ్‌ దాటకపోవడమనేది సాధారణ విషయం కాదు. సుదీర్ఘ కెరీర్‌లో ఇంత పద్ధతిగా, క్రమశిక్షణగా, స్థిరంగా బౌలింగ్‌ చేయడమనేది నేటి జనరేషన్‌లో అస్సలు ఊహించలేము. పొట్టి ఫార్మాట్‌లో ఇటీవలికాలంలో మన టీమిండియా బౌలర్‌ ఒకరు ఒకే ఓవర్‌ ఏకంగా ఐదు సార్లు క్రీజ్‌ దాటి బౌలింగ్‌ చేసిన ఘటన కళ్లముందు మెదులుతూనే ఉంది.

టెస్ట్‌ క్రికెట్‌లో ఏ బౌలర్‌కు సాధ్యంకాని ఈ రికార్డును 35 ఏళ్ల లయోన్‌ నమోదు చేసినట్లు ప్రముఖ గణాంకవేత్త మజర్‌ అర్షద్‌ వెలుగులోకి తెచ్చాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా లయోన్‌ ఈ రేర్‌ ఫీట్‌ను సాధించినట్లు మజర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు.

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆసీస్‌ను మట్టికరిపించారు. ఫలితంగా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (5/47, 70, 2/34) ఇరగదీయగా, రోహిత్‌ శర్మ (120) సెంచరీతో, అశ్విన్‌ (3/42, 5/37) 8 వికెట్లతో, అక్షర్‌ పటేల్‌ (84) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో, ఆఖర్లో షమీ మెరుపు ఇన్నింగ్స్‌ (47 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో విజృంభించారు. 

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే చాపచుట్టేయగా.. టీమిండియా 400 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లలో టాడ్‌ మర్ఫీ 7 వికెట్లతో విజృంభించగా.. కమిన్స్‌ 2, లయోన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అశ్విన్‌, జడేజా, షమీ (2/13), అక్షర్‌ పటేల్‌ (1/6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసీస్‌ కేవలం 91 పరుగులకే టపా కట్టేసి ఇన్నింగ్స్‌ ఓటమిని ఎదుర్కొంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top