
టి20ల జోరులో వన్డేలకు కాలం చెల్లిందంటూ అంతటా వినిపిస్తున్న సమయంలో ఇప్పుడు ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఊపు తెచ్చే మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మన దేశంలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా క్రికెట్‌ను విపరీతంగా అభిమానించడం దాదాపు అన్ని చోట్లా కనిపించేదే. అలాంటి చోట వరల్డ్‌కప్ అంటే సహజంగానే ఆసక్తి రెట్టింపు అవుతుంది.
పుష్కర కాలం తర్వాత వన్డే ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో ఈ టోర్నీ మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ 12 ఏళ్లలో వన్డే క్రికెట్ ఎంతో మారింది... నిబంధనలు మాత్రమే కాదు, టి20ల కారణంగా ఆటలో వేగం పెరిగింది. నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వరల్డ్‌కప్ తుది పోరును ఎవరూ మరచిపోలేరు... ఇప్పుడూ అదే తరహా జోష్‌ను ఈ టోర్నీ కూడా అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
గతంలో మూడుసార్లు ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చినా... ఇతర దేశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన భారత్ ఈసారి మాత్రం మరో దేశంతో జత కట్టకుండా పూర్తి స్థాయిలో విడిగా నిర్వహిస్తుండటం విశేషం. 2011 తర్వాత భారత్ రెండు టి20 వరల్డ్‌కప్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. 2016లో మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగ్గా... 2021లో పేరుకు మనదే ఆతిథ్యం అయినా కరోనా కారణంగా మ్యాచ్‌లకు యూఏఈ వేదికైంది.
ఇప్పుడు మరోసారి పూర్తి స్థాయి క్రికెట్ పండగ భారత్‌లో కనిపించనుంది. అభిమానుల కోణంలో చూస్తే నెలన్నర పాటు పండగ వాతావరణం ఖాయం. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్ సంబరానికి తెర లేవనుంది. నవంబర్ 19న అదే అహ్మదాబాద్ ఆఖరి పోరాటానికి వేదిక కానుంది. 10 దేశాలు, 10 వేదికలు, 46 రోజులు, 48 మ్యాచ్‌లు... మన దేశంలోని శీతల వాతావరణ సమయంలోనూ క్రికెట్ సమరాలు వేడెక్కించడం ఖాయం.
చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు