Hasan Ali: సహనం కోల్పోయిన పాక్‌ క్రికెటర్‌.. ఇంత దురుసుతనం పనికిరాదు!

Hasan Ali Heated Argument With Journalist Viral PCB Can Not Stop You At Least We Can - Sakshi

Hasan Ali Argument With Journalist Goes Viral: పాకిస్తాన్‌ పేసర్‌ హసన్‌ అలీ మరోసారి వార్తల్లో నిలిచాడు. జర్నలిస్టుతో వాదనకు దిగి దురుసుగా ప్రవర్తించాడన్న విమర్శలు మూటగట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే... పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా హసన్‌ అలీ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా సీజన్‌ ప్లేయర్స్‌ డ్రాఫ్ట్‌ లిస్టు ప్రకటన సందర్భంగా... ఓ జర్నలిస్టు పదే పదే హసన్‌ అలీని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించాడు. 

అయితే, అతడిని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్న హసన్‌ అలీ...  తర్వాతి ప్రశ్న అంటూ సమాధానం దాటవేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన సదరు జర్నలిస్టు.. ‘‘ఇది అస్సలు మంచి పద్ధతి కాదు’’ అని విసుక్కున్నాడు. హసన్‌ అలీ సైతం ఇందుకు ఘాటుగానే బదులిచ్చాడు.

‘‘ముందు ట్విటర్‌లో మంచి రాతలు రాయడం నేర్చుకోండి. ఆ తర్వాతే నేను సమాధానాలు ఇస్తాను. సరేనా? వ్యక్తిగతంగా ఓ వ్యక్తిని టార్గెట్‌ చేయడం సరికాదు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రశ్నలు అడగకుండా మిమ్మల్ని ఆపలేదేమో కానీ.. కనీసం మాకైనా ఆ హక్కు ఉంది కదా!’’ అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన హసన్‌ అలీని ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ అధికారులు సముదాయించారు. 

అప్పటి వివాదం..
అనాస్‌ సయీద్‌ అనే జర్నలిస్టు గతంలో హసన్‌ అలీని ట్విటర్‌ వేదికగా విమర్శించాడు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించాలంటూ హితవు పలికాడు. సహచర ఆటగాళ్లతో హసన్‌ అలీ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేసి... ‘‘ప్రొటోకాల్‌ ప్రకారం.. ప్రయాణాల్లో తప్పక మాస్కు ధరించాలి. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధిస్తారు’’ అంటూ సెటైర్లు వేశాడు.

ఇందుకు స్పందనగా.. ‘‘పాత వీడియోలతో డ్రామాలు చేయవద్దు. వాస్తవాలేమిటో తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి. ఫేక్‌ మసాలాలు వద్దు. మీ నుంచి సత్ప్రవర్తన ఆశిస్తున్నా’’ అని హసన్‌ అలీ బదులిచ్చాడు. తాజా ప్రెస్‌ మీట్‌లో భాగంగా మరోసారి వీరి మధ్య వాగ్వాదం జరగడం గమనార్హం. ఇందుకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘ఇంత దురుసు ప్రవర్తన పనికిరాదు’’ అంటూ హసన్‌ అలీని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అదే సమయంలో జర్నలిస్టులు కూడా నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని హితవు పలుకుతున్నారు.

ఇక ప్లాటినమ్‌ కేటగిరీలో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ హసన్‌ అలీని రిటైన్‌ చేసుకుంది. గత సీజన్‌లో అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో మథ్యూవేడ్‌ క్యాచ్‌ జారవిడిచినందుకు హసన్‌ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

చదవండి: Rohit Sharma- Virat Kohli: ఒకరి గురించి ఒకరికి తెలుసు.. కోహ్లి వల్లే ఇదంతా.. రోహిత్‌ ప్రశంసల జల్లు
BAN vs PAK: అడ్డంగా బుక్కైన హసన్‌ అలీ.. అంపైర్‌ వార్నింగ్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top