సైమండ్స్‌ మరణవార్త తెలిసి షాక్‌కు గురైన హర్భజన్‌.. మిత్రమా ఇంత త్వరగా వెళ్లిపోయావా..!

Harbhajan Singh Shocked With Andrew Symonds Sudden Demise, Pays Tribute To Former Australia Star - Sakshi

Harbhajan Shocked With Symonds Sudden Demise: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సైమండ్స్‌ మృతి పట్ల యావత్‌ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. సోషల్‌మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లతో పాటు సైమో సమకాలీకులైన భారత క్రికెటర్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.  

ఈ క్రమంలో సైమోతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. సైమండ్స్‌ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇంత త్వరగా వెళ్లిపోయావా మిత్రమా అంటూ విచారం వ్యక్తం చేశాడు. సైమో కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి తెలియజేశాడు. సైమండ్స్ ఆత్మకు శాంతి కలగాలని దేవుడికి ప్రార్థిస్తున్నాని ట్వీటాడు.

కాగా, సైమండ్స్‌-హర్భజన్‌ సింగ్‌ 'మంకీ గేట్‌' వివాదం యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్నే కుదిపేసిన విషయం తెలిసిందే. 2008 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ వివాదం చెలరేగింది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ రెండో టెస్ట్‌ (సిడ్నీ) మ్యాచ్‌లో సైమండ్స్, భజ్జీలు గొడవకు దిగారు. హర్భజన్ తనను ‘మంకీ’ అని పిలిచాడని, జాతి వివక్ష కామెంట్లతో దూషించాడని సైమండ్స్ ఆరోపించాడు. 

అయితే విచారణలో హర్భజన్.. సైమండ్స్‌ని ‘మంకీ’ అనలేదని, ‘మా..కీ’ అన్నాడని నాన్‌ స్ట్రైయికింగ్‌ ఎండ్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్ సాక్ష్యం చెప్పడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. భజ్జీ తప్పు చేయలేదని ఆధారాలున్నా ఐసీసీ అతనిపై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. దీంతో చిరెత్తిపోయిన బీసీసీఐ ఆసీస్‌ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకునేందుకు రెడీ అయ్యింది. 

దీంతో కాస్త వెనక్కు తగ్గిన ఐసీసీ భజ్జీపై నిషేధాన్ని ఎత్తి వేసింది. తదనంతర పరిణామాల్లో సైమో, భజ్జీలను ఐపీఎల్‌ కలిపింది. వీరిద్దరూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రోజుల్లో మంచి మిత్రులయ్యారు. పాత కలహాలను మరచిపోయి స్నేహితుల్లా మెలిగారు. 
చదవండి: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. ఆసిస్‌ దిగ్గజ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top