FIFA WC 2022: 8 స్టేడియాలు.. వాటి ప్రత్యేకతలు ఇవే! ఫైనల్‌, ముగింపు వేడుకలు అక్కడే! మ్యాచ్‌ ముగిసిన వెంటనే..

FIFA WC 2022: All 8 Stadiums Include 976 Interesting Facts Need Know - Sakshi

FIFA World Cup Qatar 2022- ALL 8 Stadiums: జగమంత సాకర్‌ కుటుంబాన్ని ఒక్క చోట కూర్చోబెట్టే టోర్నీ ఫుట్‌బాల్‌. అరబ్‌ ఇలాకాలో తొలి సాకర్‌ సమరం ఇదే కావడంతో ఖతర్‌ తమ సంప్రదాయాన్ని, సాంస్కృతిక ప్రాభవాన్ని ప్రతిబింబించేలా స్టేడియాల్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, వీటిలో 974 స్టేడియం ఈ మెగా ఈవెంట్‌ ముగియగానే కనుమరుగుకానుంది. ఈ నేపథ్యంలో 974తో పాటు మిగిలిన ఏడు స్టేడియాలకు సంబంధించిన విశేషాలు మీకోసం.

వేలమంది ఈలల్ని... దిక్కులన్నీ పిక్కటిల్లే గోలల్ని... తట్టుకునేలా స్టేడియాల్ని ముస్తాబు చేసింది ఖతర్‌. ఈవీ (ఎలక్ట్రిక్‌ వెహికల్‌)ల్లో  ఫుల్‌ చార్జింగ్‌తో స్టేడియాలన్నీ చుట్టేయొచ్చు. ‘కిక్‌’ ఇచ్చే ఈ ఎనిమిది స్టేడియాలు దగ్గర దగ్గరలోనే ఉండటం మరో విశేషం. అవన్నీ కూడా దోహా చుట్టుపక్కలే. ఇంకా చెప్పాలంటే ఒకే రోజు (24 గంటల వ్యవధిలో) 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించినా... అన్నింటిని చూసేయొచ్చంటే అతిశయోక్తి కాదు! ఎందుకంటే గంటల తరబడి సాగే క్రికెట్‌ కాదిది. గంటన్నరలో ముగిసే ఫుట్‌బాల్‌ కదా!


photo courtesy : Twitter

అల్‌ బైత్‌ స్టేడియం
►నగరం: అల్‌ ఖోర్‌ – సీట్ల సామర్థ్యం: 60 వేలు 
►మ్యాచ్‌లు: ఆరంభ సమరం, వేడుకలు, 
►సెమీఫైనల్‌ దాకా జరిగే పోటీలు

ఇది భిన్నమైన ఆకృతితో నిర్మించిన స్టేడియం. గల్ఫ్‌ సంచార ప్రజలు ఉపయోగించే గుడారాలే దీనికి ప్రేరణ. స్టేడియం కూడా భారీ టెంట్‌ (షామియానా)ల సమూహంగా కనిపిస్తుంది. ఖతర్‌ భూత, వర్తమానాన్ని ఆవిష్కరించేలా... హరిత అభివృద్ధికి ఆధునిక నమూనాలా ... స్టేడియాన్ని నిర్మించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది.


photo courtesy : Twitter

అహ్మద్‌ బిన్‌ అలీ స్టేడియం
►నగరం: ఉమ్‌ అల్‌ అఫాయ్‌ – సీట్ల సామర్థ్యం: 40 వేలు
►మ్యాచ్‌లు: గ్రూప్‌ దశ, ప్రీక్వార్టర్స్‌

దోహాకు 29 కి.మీ. దూరంలో ఉన్న ఈ స్టేడియం, చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు ఖతర్‌ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ప్రత్యేకించి స్టేడియం ముఖద్వారం ఇసుక తిన్నెల అలల్ని తలపిస్తుంది. చుట్టూరా ఉన్న కట్టడాలు స్థానిక వృక్షజాలం, జంతుజాల అందాల్ని వర్ణించినట్లుగా ఉంటాయి.


photo courtesy : Twitter

అల్‌ జనౌబ్‌ స్టేడియం
►నగరం: అల్‌ వక్రా – సీట్ల సామర్థ్యం: 40 వేలు 
►మ్యాచ్‌లు: గ్రూప్‌ దశ, ప్రీక్వార్టర్స్‌

దోహాకు 21 కిలో మీటర్ల దూరంలో దక్షిణ వక్రా నగరంలో దీన్ని నిర్మించారు. ఖతర్‌ సంప్రదాయ బోట్లను ప్రతిబించించేలా స్టేడియం పైకప్పు నిర్మాణం ఉంటుంది. ఈ మెగా ఈవెంట్‌ కోసం 40 వేల సామర్థ్యమున్న స్టేడియాన్ని తర్వాత్తర్వాత కుదిస్తారు. ఇతర స్పోర్ట్స్‌ ప్రాజెక్టుల కోసం విరాళంగా ఇస్తారు. 


photo courtesy : Twitter

ఖలీఫా ఇంటర్నేషనల్‌ స్టేడియం
►నగరం: దోహా – సీట్ల సామర్థ్యం: 40 వేలు 
►మ్యాచ్‌లు: గ్రూప్‌ దశ, ప్రీక్వార్టర్స్, మూడో స్థానం ప్లే ఆఫ్‌

చాన్నాళ్ల క్రితమే 1976లో నిర్మించిన ఈ స్టేడియాన్ని 2005లో పూర్తిగా నవీకరించారు. 2006లో ఈ స్టేడియంలోనే ఆసియా క్రీడలు నిర్వహించారు. ఆ పాత మైదానం నుంచి అధునాతన స్టేడియంగా ఎన్నో సదుపాయాల నెలవుగా దీన్ని విస్తరించారు. అక్వాటిక్, స్పోర్ట్స్‌ మెడిసిన్, స్పోర్ట్స్‌ మ్యూజియం ఇలా ఒకటేమిటి అన్ని హంగులకూ ఈ స్టేడియం పెట్టిందిపేరు.


photo courtesy : Twitter

ఎడ్యుకేషన్‌ సిటీ స్టేడియం
►నగరం: అల్‌ రయ్యాన్‌ 
►సీట్ల సామర్థ్యం: 40 వేలు 
►మ్యాచ్‌లు: గ్రూప్‌ దశ, ప్రీక్వార్టర్స్‌, క్వార్టర్‌ ఫైనల్స్‌

దోహాకు అత్యంత చేరువలో 12 కిలో మీటర్ల దూరంలోనే ఈ స్టేడియం ఉంది. ప్రపంచశ్రేణి యూనివర్సిటీ క్యాంపస్‌ల మధ్యలో దీన్ని నిర్మించారు. డైమండ్‌ బిళ్లల ఆకారంలో ఉండే ఈ స్టేడియంపై సూర్యరశ్మి ఎక్కడ పడితే అక్కడ (డైమండ్‌ బిళ్లలపై పడే సూర్యరశ్మి) మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తుంది. ఎడ్యుకేషన్‌ సిటీలో ఉన్న ఈ స్టేడియంలోని సగం టికెట్లను వర్సిటీ జట్లు, విద్యార్థుల కోసమే రిజర్వ్‌ చేశారు.


photo courtesy : Twitter

లుసాయిల్‌ స్టేడియం
►నగరం: లుసాయిల్‌ 
►సీట్ల సామర్థ్యం: 80 వేలు    

మ్యాచ్‌లు: ఫైనల్‌దాకా సాగే మ్యాచ్‌లన్నిటికీ లుసాయిల్‌ ప్రధాన స్టేడియం. దోహాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రూప్‌ దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్‌ ఆఖరికి ఫైనల్‌ మ్యాచ్(డిసెంబరు 18), ముగింపు వేడుకలనూ ఇక్కడే నిర్వహిస్తారు.

టోర్నీ దిగ్విజయంగా ముగిసిన అనంతరం దీన్ని కమ్యూనిటీ సెంటర్‌గా మార్చేస్తారట! పాఠశాలలు, షాప్‌లు, కేఫ్, స్పోర్ట్స్, ఆరోగ్య కేంద్రాలను ఇందులో నిర్వహిస్తారు.


photo courtesy : Twitter

974 స్టేడియం
►నగరం: దోహా 
►సీట్ల సామర్థ్యం: 40 వేలు 
►మ్యాచ్‌లు: గ్రూప్‌ దశ, ప్రీక్వార్టర్స్‌

హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరువలో ఉంటుంది ఈ స్టేడియం. గల్ఫ్‌ కోస్తా ప్రాంతంలోని ఆకాశహర్మ్యాల మధ్య షిప్పింగ్‌ కంటెయినర్స్‌తో నిర్మించారు. మొత్తం 974 కంటెయినర్లను వినియోగించడంతో పాటు ఖతర్‌ ఐఎస్‌డీ (ఇంటర్నేషనల్‌ సబ్‌స్క్రైబర్‌ డయలింగ్‌) కోడ్‌ కూడా 974 కావడంతో ఆ నంబర్‌నే స్టేడియానికి పేరుగా పెట్టారు. ఈ మైదానానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని పూర్తిగా పడగొడితే ఇందులోని మెటిరీయల్‌ వృథాకాకుండా పునర్వినియోగానికి అంతా పనికొస్తుందట!


photo courtesy : Twitter

అల్‌ తుమమ స్టేడియం
►నగరం: దోహా – సీట్ల సామర్థ్యం: 40 వేలు
►మ్యాచ్‌లు: గ్రూపు దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్‌ ఫైనల్స్‌

అల్‌ తుమమ స్టేడియం అరబ్‌ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ఆర్కిటెక్చరల్‌ ఐకాన్‌. సంప్రదాయ ఖాఫియా నుంచి ప్రేరణతో రూపొందించారు. ఖాఫియా అంటే టోపీ. దాని ఆకారంలోనే ఈ స్టేడియాన్ని నిర్మించారు. డిజైన్, అద్దిన రంగులు, దిద్దిన సొబగులన్నీ ఓ పే...ద్ద టోపీలాగే ఉంటుంది. అరబ్‌ సాంస్కృతిక చరిత్రకు దర్పణంలా కనిపిస్తుంది.  
-యెల్లా రమేశ్‌ 

చదవండి: Rahul vs Pant: అతడు ‘ఆల్‌రౌండర్‌’.. తుది జట్టులో తనే ఉండాలి.. బౌలింగ్‌ ఆప్షన్‌ దొరుకుతుంది: భారత దిగ్గజం
Ind Vs Ban: చెత్త బ్యాటింగ్‌.. రోహిత్‌ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి: మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top