పాక్‌ క్రికెట్‌లో విష సంస్కృతి ఎక్కువ! | Ex-coach Gary Kirsten Slams PCB Toxic Work Culture In Pak Cricket | Sakshi
Sakshi News home page

పాక్‌ క్రికెట్‌లో విష సంస్కృతి ఎక్కువ!

Mar 21 2026 3:44 PM | Updated on Mar 21 2026 4:14 PM

Ex-coach Gary Kirsten Slams PCB Toxic Work Culture In Pak Cricket

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై విమర్శలు గుప్పించాడు. వ్యవస్థాగత జోక్యం, వృత్తిపరమైన గౌరవం కొరవడడంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ ప్రధాన కోచ్‌గా పనిచేయడం తనకు నరకంలా అనిపించిందని కిర్‌స్టన్‌ చెప్పుకొచ్చాడు. ఇటీవలే శ్రీలంక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కిర్‌స్టన్‌ పీసీబీ చైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ నేతృత్వంలో పని చేసే వర్క్‌ కల్చర్‌ దారుణంగా ఉండేదని పేర్కొన్నాడు. 

కిర్‌స్టన్‌  మాట్లాడుతూ.. ‘నేను చూసిన జట్లలో ఇంత స్థాయి జోక్యం ఎక్కడా చూడలేదు. కోచ్‌గా వచ్చి ప్లేయర్లతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే బయట నుంచి వచ్చే ఈ నాయిస్ చాలా కష్టంగా మారుతుంది. జట్టు ఫలితాలు సరిగా రాకపోతే కోచ్‌పైనే ఒత్తిడి పెంచడం, ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రతికూలంగా మారుతాయి. 

టీమ్ బాగా ఆడకపోతే కోచ్‌ను తీసేయడం లేదా అతనిపై పరిమితులు పెట్టడం చాలా ఈజీ. కానీ అదే తప్పు. అలా అయితే కోచ్‌ని ఎందుకు నియమిస్తారు?’అంటూ కిర్‌స్టెన్ ప్రశ్నించాడు. ఇక తన భవిష్యత్‌పై కూడా క్లారిటీ ఇచ్చిన కిర్‌స్టెన్, తాజాగా శ్రీలంక క్రికెట్‌తో రెండు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ కోసం శ్రీలంక జట్టును సిద్ధం చేయడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఈ టోర్నమెంట్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. 2024లో టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ స్టేజీలోనే పాకిస్థాన్‌ నిష్క్రమించడంతో పీసీబీ వైఖరితో పొసగక కిర్‌స్టన్‌ తన పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. 

అంతకముందు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జాసన్‌ గిలెస్పీ నిష్క్రమణ కూడా దాదాపు ఇలాంటి పద్దతిలోనే జరగడం గమనార్హం. ఇంగ్లండ్‌పై స్వదేశంలో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయాన్ని పాక్‌ జట్టుకు అందించినప్పటికీ, మోసిన్‌ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ కనీస సమాచారం ఇవ్వకుండానే గిలెస్పీని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనంగా నిలిచింది.

చదవండి: IPL 2026: పంజాబ్‌ ‘కింగ్స్‌’ అయ్యేనా?

Advertisement
 
Advertisement
Advertisement