Emma Raducanu: అంతా నాలుగు నెలల్లోనే... అనామక ప్లేయర్‌ నుంచి చాంపియన్‌ దాకా!

Emma Raducanu is Normal player to a Grand Slam champion in four months - Sakshi

అనామక ప్లేయర్‌ నుంచి గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా ఎదిగిన రాడుకాను

ఈ టోర్నీకి ముందు ఎమ్మా రాడుకాను ... పెద్దగా ఎవరికీ తెలియని పేరు! కానీ ఆదివారం క్రీడా ప్రపంచంలో మార్మోగుతున్న పేరు అదే!  ఇంతకు తను ఏం చేసింది. యూఎస్‌ ఓపెన్‌ గెలిచింది. ఓస్‌ అంతేనా! అంతేనా అంటారేంటి. ఆమె ఓ సంచలనం. అదేలా... మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సర్క్యూట్‌లోకి వచ్చిందే ఈ జూన్‌లో. ఆడిన అనుభవం ఒక్కటే గ్రాండ్‌స్లామ్‌ (వింబుల్డన్‌). బరిలోకి దిగిన రెండో గ్రాండ్‌స్లామ్‌లోనే విజేత! ఆమె చరిత్రకెక్కింది... మరి ఇదెలాగో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి టైటిల్‌ గెలవడం... రాడుకాను ఇంత చేసిందా! అవును... 18 ఏళ్ల చిన్నది చకచకా పెద్ద టోర్నీనే జయించింది. ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది.
–సాక్షి క్రీడావిభాగం

నిజానికి ఇంత చేస్తానని, యూఎస్‌ ఓపెన్‌ గెలుస్తానని తను కూడా అనుకోలేదు కాబోలు. ఎందుకంటే రాడుకాను క్వాలిఫయింగ్‌ టోర్నీ దశ వరకే ఇంగ్లండ్‌కు రిటర్న్‌ టికెట్‌ (ఫ్లయిట్‌) కూడా బుక్‌ చేసుకుంది. ఓ మూడు వారాలు ప్రత్యర్థులందరినీ ఓడిస్తూ ఏకంగా ఇపుడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో పయనమవుతోంది. ఆమె ఆట... ఫైనల్‌దాకా ఆమె వేసుకున్న బాట ఎవరి ఊహకు అందదు. అసలు ఒకటో రెండో రౌండ్‌కే ఇంటికి చేరాల్సిన బ్రిటన్‌ భామ గ్రాండ్‌‘సలామ్‌’ కొట్టే ప్రదర్శన చేసింది.

అమ్మ... నాన్న... ఓ కెనడా పాపాయి
ఎమ్మా రాడుకాను సహా వాళ్ల అమ్మ, నాన్నది ఇంగ్లండ్‌ కాదు. ఇంకా చెప్పాలంటే ఈ ముగ్గురివి వేర్వేరు ప్రదేశాలు కాదు... ఏకంగా వేర్వేరు దేశాలే! నాన్న ఇయాన్‌ది రొమేనియా. తల్లి రెనీది చైనా. ఎమ్మా పుట్టిందేమో టోరంటో (కెనడా)! ఈ కెనడా పాపాయి రెండేళ్ల వయసులో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. అక్కడే ఐదేళ్ల ప్రాయంలో రాకెట్‌ పట్టింది. పదమూడేళ్లు తిరిగే సరికే (18 ఏళ్ల వయసులో) యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ అయ్యింది.  

జయం భళారే విజయం
ఎమ్మా రాడుకాను సీడెడ్‌ ప్లేయరేం కాదు. ప్రపంచ 150వ ర్యాంకర్‌. ఓ క్వాలిఫయర్‌! వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిస్తేనే మెయిన్‌ ‘డ్రా’ ప్రాప్తం లభిస్తుంది. గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్లలో క్వాలిఫయర్‌ లక్ష్యం ఏదైనా ఉందంటే అది మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సంపాదించడమే! అలా క్వాలిఫయింగ్‌ అంచెను దాటింది. మెయిన్‌ ‘డ్రా’ ఆట మొదలుపెట్టింది. ఒక్కొక్కరినీ ఒక్క సెట్‌ కోల్పోకుండానే కంగుతినిపించింది. ఇలా ఒకటి, రెండు కాదు... ఏడు మ్యాచ్‌ (ఫైనల్‌)ల దాకా తలవంచని ఈ టీనేజ్‌ సంచలనం ఏకంగా పది మ్యాచ్‌ల్లో (క్వాలిఫయింగ్‌ సహా) ఈ రికార్డుతో చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల టెన్నిస్‌లో ఇంతవరకు ఏ ఒక్కరికి సాధ్యం కానీ అరుదైన, అసామాన్యమైన రికార్డుతో రాడుకాను టెన్నిస్‌ పుటల్లో నిలిచింది.

అందరినీ వరుస సెట్లలోనే!
జూనియర్‌ స్థాయిలో మూడు టైటిల్స్‌ గెలిచిన రాడుకాను ఈ మధ్యే డబ్ల్యూటీఏ మ్యాచ్‌లు ఆడటం మొదలుపెట్టింది. ఈ జూన్‌లో నాటింగ్‌హామ్‌లో జరిగిన గ్రాస్ట్‌కోర్ట్‌ టెన్నిస్‌ టోరీ్నతో ఎమ్మా ఫ్రొఫెషనల్‌ టెన్నిస్‌ షురూ అయింది. మరుసటి నెలలో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో వింబుల్డన్‌ మెయిన్‌ ‘డ్రా’లో ఆడింది. మూడు రౌండ్లు గెలిచి ఊపుమీదున్న రాడుకాను ప్రిక్వార్టర్స్‌లో శ్వాస సమస్యతో మ్యాచ్‌ మధ్యలోనే వైదొలగింది.

దీంతో ఆమె వైల్డ్‌కార్డ్‌కు అనారోగ్యంతో శుభం కార్డు పడింది. కోలుకున్నాక అమెరికా వచి్చంది. గత నెల చికాగో డబ్ల్యూటీఏ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. తిరిగి ఓ అనామక క్రీడాకారిణిగా యూఎస్‌ ఓపెన్‌ ఆడింది. మెయిన్‌ డ్రాకు చేరాక మేటి క్రీడాకారిణుల భరతం పట్టింది. ఆమె ప్రతీ మ్యాచ్‌ను వరుస సెట్లలోనే ముగించడం విశేషం. ఈ పరంపరలో ప్రపంచ 11వ ర్యాంకర్, టోక్యో ఒలింపిక్‌ చాంపియన్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌)ను క్వార్టర్స్‌లో కంగుతినిపించింది. సెమీస్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న మరియా సాకరి (18వ ర్యాంక్‌; గ్రీస్‌)ని మట్టికరిపించి టైటిల్‌ బరిలో నిలిచింది.

వర్జినియా వేడ్‌ తర్వాత...
ఓ ఇంగ్లండ్‌ మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచి దశాబ్దాలైంది. 1977లో వర్జినియా వేడ్‌ సొంతగడ్డపై వింబుల్డన్‌ గెలిచాక ఇంకెవరూ మేటి టైటిల్‌ గెలవనే లేదు. ఇప్పుడు రాడుకాను 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో రాడుకాను 150వ స్థానం నుంచి నేడు అనూహ్యంగా 24వ ర్యాంక్‌కు ఎగబాకనుంది.

అన్‌సీడెడ్‌ హోదాలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన 13వ ప్లేయర్‌ ఎమ్మా రాడుకాను. గతంలో స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా; 2017లో యూఎస్‌ ఓపెన్‌), ఒస్టాపెంకో (లాత్వి యా; 2017లో ఫ్రెంచ్‌ ఓపెన్‌), క్లియ్‌స్టర్స్‌ (బెల్జియం; 2009లో యూఎస్‌ ఓపెన్‌), సెరెనా విలియమ్స్‌ (అమెరికా; 2007లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌), గాస్టన్‌ గాడియో (అర్జెంటీనా; 2005లో ఫ్రెంచ్‌ ఓపెన్‌), ఇవానిసెవిచ్‌ (క్రొయేషియా; 2001లో వింబుల్డన్‌), కుయెర్టన్‌ (బ్రెజిల్‌; ఫ్రెంచ్‌ ఓపెన్‌ 1997), అగస్సీ (అమెరికా; 1994లో యూఎస్‌ ఓపెన్‌), బోరిస్‌ బెకర్‌ (జర్మనీ; 1985లో వింబుల్డన్‌), విలాండర్‌ (స్వీడన్‌; 1982లో ఫ్రెంచ్‌ ఓపెన్‌), క్రిస్‌ ఓనీల్‌ (ఆస్ట్రేలియా; 1978లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌), మార్క్‌ ఎడ్మండ్‌సన్‌ (ఆ్రస్టేలియా; 1976లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) ఈ ఘనత సాధించారు.


తన అభిమాన ప్లేయర్‌ హలెప్‌తో చిన్నారి రాడుకాను
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top