సీఎస్‌కే నుంచి రికార్డు లాగేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ | Delhi Capitals Dethrone CSK In Embarrassing IPL Feat | Sakshi
Sakshi News home page

సీఎస్‌కే నుంచి రికార్డు లాగేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

May 9 2026 12:21 PM | Updated on May 9 2026 12:35 PM

Delhi Capitals Dethrone CSK In Embarrassing IPL Feat

ఐపీఎల్‌ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. నిన్న (మే 8) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలై ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా అంతం చేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో డీసీ బ్యాటర్లు నెమ్మదిగా ఆడుతూ ఓ అవమానకర రికార్డును తమ పేరిట నమోదు చేసుకున్నారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన వారు నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేశారు. ఓ దశలో జట్టు 89/5 స్కోరుతో కష్టాల్లో పడగా, కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌, అశుతోష్‌ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. అయితే ఇద్దరూ కలిసి 46 బంతుల్లో కేవలం 39 పరుగులే చేయడం విమర్శలకు దారితీసింది.

ప్రత్యేకంగా 12 నుంచి 16వ ఓవర్‌ మధ్య వీరిద్దరు కేవలం 11 పరుగులే సాధించారు. ఇందులో 19 డాట్‌బాల్స్‌ ఉండటం గమనార్హం. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో ఆ దశలో అత్యల్ప పరుగులు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలిచింది. గతంలో ఈ చెత్త రికార్డు చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేరిట ఉండేది. సీఎస్‌కే గత సీజన్‌లో ఇదే కోల్‌కతాపై 12 నుంచి 16 ఓవర్ల మధ్య 12 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పుడు డీసీ ఆ రికార్డును అధిగమించింది.

ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ సెంచరీతో (47 బంతుల్లో 100 నాటౌట్‌; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) కదంతొక్కగా, కేకేఆర్‌ కేవలం 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ గెలుపుతో కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట ఓడి, ఒక్క గెలుపు కూడా లేకుండానే నిష్క్రమించేలా కనిపించిన కేకేఆర్‌.. ఆతర్వాత ఒక్కసారిగా విజయాల బాట పట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి అనూహ్యపోరాటాన్ని ప్రదర్శిస్తుంది. 

ప్రస్తుతం కేకేఆర్‌ పదింట నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ జట్టుకు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ నాలుగిట్లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు తప్పక ఉంటాయి. పంజాబ్‌తో జరగాల్సిన ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

ఎస్‌ఆర్‌హెచ్‌ (14), పంజాబ్‌ కింగ్స్‌ (13), ఆర్సీబీ (12), రాజస్థాన్‌ (12), గుజరాత్‌ (12), సీఎస్‌కే (10) పాయింట్ల పట్టికలో టాప్‌-6 జట్లుగా ఉండి, నాలుగు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఈ జట్లతో కేకేఆర్‌ (9) పోటీపడాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement