
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ దీప్తి శర్మను అభిమానులు "లేడీ సెహ్వాగ్" అని పిలుచుకుంటారు. దీప్తి సెహ్వాగ్‌లా భయం, బెరుకు లేకుండా డాషింగ్‌గా షాట్లు ఆడటమే ఇందుకు కారణం. లేడీ సెహ్వాగ్ బిరుదుకు దీప్తి శర్మ తాజాగా మరోసారి సార్దకత చేకూర్చింది. నిన్న (జులై 16) ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో దీప్తి మెరుపు ఇన్నింగ్స్ (64 బంతుల్లో 62; 3 ఫోర్లు, సిక్స్) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించింది.
ఈ ఇన్నింగ్స్‌లో దీప్తి కొట్టిన ఏకైక సిక్సర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ షాట్‌ను దీప్తి రిషబ్ పంత్‌లా ఆడటం వల్ల అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. దీప్తి పంత్ ట్రేడ్ మార్క్ షాట్ అయిన "ఒంటి చేత్తో సిక్సర్" విజయవంతంగా పూర్తి చేయడంలో సఫలమైంది.
DEEPTI SHARMA ON ONE-HANDED SIX:
"I play these shots in practice - I picked that up from Rishabh Pant". pic.twitter.com/Y5u2eYdZ0i— Johns. (@CricCrazyJohns) July 17, 2025
మ్యాచ్ అనంతరం ఈ షాట్ గురించి దీప్తి మాట్లాడుతూ.. నేను ఇలాంటి షాట్లను నిత్యం ప్రాక్టీస్ చేస్తుంటాను. రిషబ్ పంత్‌ను చూసినప్పటి నుంచే ఇలాంటి షాట్లను ఆడటం మొదలుపెట్టానని అంది.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగుతోంది. ఈ పర్యటనలో ఇదివరకే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. సోఫీ డంక్లీ (83), డేవిడ్‌సన్ రిచర్డ్స్ (53) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు తీయగా.. అమన్‌జోత్ కౌర్, శ్రీ చరణి చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆది నుంచే నిలకడగా ఆడుతూ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. టాపార్డర్ బ్యాటర్లలో ప్రతీక రావల్ (36), స్మృతి మంధన (28), హర్లీన్ డియోల్ (27), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17), జెమీమా రోడ్రిగెజ్ (48) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (62 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో భారత్‌ను గెలిపించింది.