సెంచరీలు బాదినా నో ఛాన్స్‌: ‘దేశం మారితేనైనా ఫలితం ఉంటుందేమో!’ | Contact Unmukt Chand Know That Process, Fans Reacts As Sarfaraz Khan Slams 100 for India A - Sakshi
Sakshi News home page

సెంచరీలు బాదినా నో ఛాన్స్‌: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’

Published Thu, Jan 25 2024 4:39 PM

Contact Unmukt Chand Know That Process Fans Reacts Sarfaraz Slams 100 for India A - Sakshi

ఇంగ్లండ్‌ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్టులో భారత్‌-ఏ జట్టు బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గురువారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తన 14వ సెంచరీ నమోదు చేశాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో కేవలం 89 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.

డబుల్‌ సెంచరీ దిశగా బ్యాట్‌ ఝులిపిస్తూ ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్‌ అహ్మద్‌పై ప్రశంసలు కురిపిస్తున్న టీమిండియా అభిమానులు.. అదే సమయంలో బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకున్నాడు. రంజీల్లో పరుగుల వరద పారించి టీమిండియా టెస్టు జట్టు రేసులో ఎల్లప్పుడూ ముందే ఉన్నాడు.

కానీ సెలక్టర్లు మాత్రం అతడిని కనికరించడం లేదు. ప్రధాన జట్టుకు ఈ ముంబై ఆటగాడిని ఎంపిక చేయడం లేదు. అయితే, ఇంగ్లండ్‌ లయన్స్‌తో స్వదేశంలో మూడు అనధికారిక టెస్టు సిరీస్‌లో తలపడే భారత-ఏ జట్టులో మాత్రం చోటిచ్చారు.

ఇందులో భాగంగా వామప్‌ మ్యాచ్‌లో 96 పరుగులతో ఆకట్టుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. తొలి అనధికారిక టెస్టులో 55 పరుగులతో పర్వాలేదనిపించాడు. అంతకు ముందు సౌతాఫ్రికా గడ్డపై ఈ 26 ఏళ్ల ముంబై బ్యాటర్‌ మొత్తంగా 102 పరుగులు సాధించాడు.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి టెస్టుకు విరాట్‌ కోహ్లి దూరం కాగా సర్ఫరాజ్‌ ఖాన్‌కు సెలక్టర్లు పిలుపునిస్తారని అతడి అభిమానులు భావించారు. కానీ మధ్యప్రదేశ్‌ ఆటగాడు రజత్‌ పాటిదార్‌తో కోహ్లి స్థానాన్ని భర్తీ చేయడంతో సర్ఫరాజ్‌కు మరోసారి మొండిచేయే ఎదురైంది.

ఈ నేపథ్యంలో తాజాగా అతడు సెంచరీ బాదిన తర్వాత నెట్టింట బీసీసీఐపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు ఫ్యాన్స్‌. ‘‘తన బ్యాటింగ్‌లో తార స్థాయికి వెళ్లిన తర్వాత .. రెండు- మూడు ఛాన్సులు ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ జట్టు నుంచి తప్పిస్తారు.

ఇదంతా భరించే బదులు.. అతడు ఉన్ముక్త్‌ చాంద్‌ను సంప్రదించి.. దేశం నుంచి వలస వెళ్లి.. అక్కడే క్రికెట్‌ ఆడుకుంటే మంచిది!! ఇక్కడుంటే మాత్రం సర్ఫరాజ్‌ ఖాన్‌కు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాకపోవచ్చు. మన సెలక్టర్ల ఆలోచనలు ఏమిటో ఎవరికీ అర్థం కావు కదా. ఏదేమైనా అతడికి అన్యాయం జరుగుతుందనేది మాత్రం వాస్తవం’’ అంటూ ఫైర్‌ అవుతున్నారు.

కాగా గత రంజీ సీజన్లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ముంబై తరఫున బరిలోకి దిగి సగటు 92.66తో 556 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక 2021/22 సీజన్లో 982 పరుగులతో అతడు టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో.. ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఓవరాల్‌గా 65 ఇన్నింగ్స్‌లో 3751 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 11 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇలా మెరుగైన గణాంకాలు నమోదు చేస్తున్నప్పటికీ సర్ఫరాజ్‌ ఖాన్‌ మాత్రం టీమిండియాలో చోటు దక్కకపోవడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్‌ అందించిన కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చాంద్.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వెళ్లి సెటిలయ్యాడు. యూఎస్‌ఏ తరఫున అంతర్జాతీయ క్రికెటర్‌గా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్‌ ఖాన్‌కు కూడా ఇదే గతి పట్టిస్తారేమోనంటూ అతడి అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement