కెప్టెన్‌గా చతేశ్వర్‌ పుజారా

Cheteshwar Pujara To Lead Sussex In County Championship - Sakshi

టీమిండియా టెస్ట్‌ క్రికెటర్‌, నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా కెప్టెన్‌ అయ్యాడు. ఇంగ్లండ్‌ కౌంటీ ఛాంపియన్‌-2023 డివిజన్‌-2లో అతను ససెక్స్‌ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్‌కు సారథ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది.. లెట్స్‌ గో అంటూ ట్వీట్‌కు క్యాప్షన్‌ జోడించాడు.

ససెక్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ టామ్‌ హెయిన్స్‌ గత సీజన్‌ సందర్భంగా గాయపడటంతో ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ నాటి నుంచి పుజారాను తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగిస్తుంది. కౌంటీ ఛాంపియన్‌-2023 డివిజన్‌-2 సీజన్‌లో భాగంగా ససెక్స్‌ ప్రస్థానం ఇవాల్టి (ఏప్రిల్‌ 6) నుంచి ప్రారంభమవుతోంది. ససెక్స్‌.. ఇవాళ డర్హమ్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

కాగా, ఇంగ్లండ్‌ ఫస్ట్‌క్లాస్‌ టోర్నీల్లో పుజారాకు ఇది వరుసగా రెండో సీజన్‌. 2022లో అతను ససెక్స్‌ తరఫున 13 ఇన్నింగ్స్‌ల్లో 109.40 సగటున 1094 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. పుజారా గతేడాది రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో కూడా ఆడాడు. అందులోనూ నయా వాల్‌ సత్తా చాటాడు.

పుజారా చివరిసారిగా టీమిండియా తరఫున బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఆడాడు. ఈ సిరీస్‌లో అతను 6 ఇన్నింగ్స్‌ల్లో 28 సగటున కేవలం 140 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇదే సిరీస్‌లోనే పుజారా తన 100 టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top