టైమ్‌కి చెక్‌ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం? | Sakshi
Sakshi News home page

IPL 2024: టైమ్‌కి చెక్‌ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం?

Published Thu, May 23 2024 6:35 PM

'Bank Balance Thik Hai, Cheque Pohoch Jaaega Time Pe': Former Indian Star Tears Into Maxwell

‘‘అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో ఎంతో అనుభవం గడించాడు. ఆస్ట్రేలియా తరఫున ఎల్లప్పుడూ అద్భుతంగా ఆడతాడు. కానీ ఐపీఎల్‌కు వచ్చే సరికి.. అతడికి ఏమవుతుందో తెలియడం లేదు.

బహుశా ఐపీఎల్‌ పట్ల అతడికి ఆసక్తి లేదేమో?!.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు తాను అవుటైనా పర్లేదనకుంటాడేమో!.. అతడి బ్యాంకు బ్యాలెన్స్‌ నిండుగా ఉంది.

సమయానికి చెక్‌ అందుతుంది. సహచర ఆటగాళ్లతో కలిసి రాత్రుళ్లు పార్టీలు.. నవ్వులు.. సరదాలు.. ఫొటోలకు ఫోజులు.. ఇంతే’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆట తీరును విమర్శిస్తూ అతడిపై మండిపడ్డాడు. ఫ్రాంఛైజీ నుంచి టైమ్‌కు చెక్కులు తీసుకోవడం మాత్రమే అతడికి తెలుసని.. ఆటపై అసలు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  

కాగా ఐపీఎల్‌-2024 నేపథ్యంలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మాక్సీని ఆర్సీబీ రూ. 11 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. అయితే, ఈ సీజన్‌లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 52 పరుగులు చేశాడు. అదే విధంగా.. ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు ఈ ఆర్థోడాక్స్‌ బౌలర్‌.

కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ
మానసికంగా అలసిపోయానంటూ కొన్నాళ్లు సెలవు కూడా తీసుకున్నాడు. ఇక కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ మాక్స్‌వెల్‌ తేలిపోయాడు. రాజస్తాన్ రాయల్స్‌తో అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో మాక్సీ డకౌట్‌ అయ్యాడు.

టాపార్డర్‌లో విరాట్‌ కోహ్లి(33) ఒక్కడు ఫర్వాలేదనిపించగా.. ఫాఫ్‌ డుప్లెసిస్‌, కామెరాన్‌ గ్రీన్‌(27) త్వరగానే నిష్క్రమించారు. ఈ క్రమంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ 34 పరుగులతో ఆకట్టుకోగా.. ఐదో స్థానంలో వచ్చిన మాక్సీ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌
మిగతా వాళ్లలో మహిపాల్‌ లామ్రోర్‌(17 బంతుల్లో 32) చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని రాజస్తాన్‌ 19 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా క్వాలిఫయర్‌-2కి అర్హత సాధించింది. ఆర్సీబీ యథావిథిగా ఇంటిబాట పట్టింది.

ఈ నేపథ్యంలో మనోజ్‌ తివారీ మాక్సీ ఆట తీరును విమర్శిస్తూ పైవిధంగా స్పందించాడు. అదే విధంగా ఆర్సీబీ స్థాయికి తగ్గట్లు రాణించలేదని.. వరుసగా ఆరు విజయాలు సాధించినా.. అసలు పోరులో ఓడిపోతే లాభం ఉండదంటూ పెదవి విరిచాడు.

చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్‌! అరుదైన రికార్డులు.. దటీజ్‌ డీకే!

Advertisement
 
Advertisement
 
Advertisement