AUS Open 2023: సంచలనం.. రెండోరౌండ్‌లోనే వెనుదిరిగిన టాప్‌స్టార్‌

Australian Open: World No-3-Casper Ruud Knocked-Out-By-Jensen-Brooks - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో మరో సంచలనం నమోదైంది. వరల్డ్‌ మూడో ర్యాంకర్‌.. నార్వే సూపర్‌స్టార్‌ కాస్పర్‌ రూడ్‌ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖ​ం పట్టాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో భాగంగా గురువారం కాస్పర్‌ రూడ్‌, అమెరికాకు చెందిన 37వ ర్యాంకర్‌ జెన్సన్‌ బ్రూక్స్‌బై మధ్య మ్యాచ్‌ జరిగింది.

ఈ మ్యాచ్‌లో బ్రూక్స్‌బై కాస్పర్‌ రూడ్‌ను 6-3, 7-5,6-7(4), 6-2తో మట్టికరిపించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మ్యాచ్‌లో తొలి రెండుసెట్లు బ్రూక్స్‌బై గెలుచుకొని ఆధిక్యం కనబరిచినప్పటికి.. మూడోసెట్‌ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో విజృంభించిన కాస్పర్‌ రూడ్‌ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక నాలుగో సెట్‌లో తొలుత బ్రూక్స్‌బై తడబడినప్పటికి తిరిగి ఫుంజుకొని 6-2తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. 

గతేడాది రెండు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన కాస్పర్‌ రూడ్‌ ఈసారి ఎలాగైనా తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కొట్టాలన్న కసితో బరిలోకి దిగాడు. కానీ అతని పోరాటం రెండో రౌండ్‌తోనే ముగిసిపోయింది. ఇప్పటికే వరల్డ్‌ నెంబర్‌ రెండో ర్యాంకర్‌.. స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మెకంజీ మెక్‌డొనాల్డ్‌ చేతిలో నాదల్‌ ఓటమి పాలయ్యాడు. అయితే ఎడమ కాలి తుంటి గాయంతో బాధపడుతున్న నాదల్‌ కోలుకోవడానికి 6-8 వారాలు పట్టే అవకాశం ఉందని స్వయంగా పేర్కొన్నాడు. ఇక నెంబర్‌వన్‌ ఆటగాడు జొకోవిచ్‌ మాత్రం దూసుకెళుతున్నాడు. 

చదవండి: మ్యాచ్‌ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!?

'మనకి, వాళ్లకి తేడా ఉండాలి కదా.. చిన్నపిల్లాడి మనస్తత్వం!'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top