విధ్వంసంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను దాటేసిన టిమ్‌ డేవిడ్‌.. భారీ రికార్డు | AUS VS SA 1st T20: Tim David Beats Suryakumar Yadav In A Legendary T20I List | Sakshi
Sakshi News home page

విధ్వంసంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను దాటేసిన టిమ్‌ డేవిడ్‌.. భారీ రికార్డు

Aug 11 2025 11:19 AM | Updated on Aug 11 2025 11:49 AM

AUS VS SA 1st T20: Tim David Beats Suryakumar Yadav In A Legendary T20I List

ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత ప్రమాదకర బ్యాటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన టిమ్‌ డేవిడ్‌ ఒకరు. టిమ్‌ బ్యాట్‌ పట్టాడంటే విధ్వంసమే. బరిలోకి దిగాడంటే సిక్సర్ల సునామే. 

ఈ ఏడాది ప్రారంభం నుంచి (22 మ్యాచ్‌ల్లో 54 సగటున 181 స్ట్రయిక్‌రేట్‌తో 649 పరుగులు) పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే టిమ్‌ అవకాశం వచ్చిన ప్రతిసారి బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు.

తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే సీన్‌ రిపీటైంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగిన టిమ్‌.. సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఈ ఇన్నింగ్స​ తర్వాత టిమ్‌ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 

విధ్వంసంలో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను దాటేశాడు. టెస్ట్‌ క్రికెట్‌ ఆడే దేశాల్లో కనీసం 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌ (51 ఇన్నింగ్స్‌ల్లో 167.37 స్ట్రయిక్‌రేట్‌తో 1416 పరుగులు) కలిగిన ఆటగాడిగా నిలిచాడు.

ఈ రికార్డు స్కై పేరిట ఉండేది. స్కై అతని టీ20 కెరీర్‌లో 167.07 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. ఈ జాబితాలో టిమ్‌, స్కై తర్వాతి స్థానాల్లో ఫిల్‌ సాల్ట్‌ (164.32), ఆండ్రీ రసెల్‌ (163.69), ఫిన్‌ అలెన్‌ (163.27), ట్రవిస్‌ హెడ్‌ (159.15) ఉన్నారు. టిమ్‌ ఇదే విధ్వంసాన్ని కొనసాగిస్తే.. 2026 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌కు కీలకమయ్యే అవకాశం ఉంది.

తాజాగా విండీస్‌తో జరిగిన ఓ టీ20లో టిమ్‌ 37 బంతుల్లోనే శతక్కొట్టి ఆ దేశం​ తరఫున పొట్టి ఫార్మాట్‌లో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. 

ఇటీవల ఆస్ట్రేలియా టీ20ల్లో సాధిస్తున్న వరుస విజయాల్లో టిమ్‌ది కీలకపాత్ర. టిమ్‌ మెరుపుల కారణంగా ఇటీవల విండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 5-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20లోనూ గెలిచిన ఆసీస్‌.. వరుసగా 9 టీ20ల్లో గెలిచి తమ వరుస విజయాల రికార్డును మరింత మెరుగుపర్చుకుంది.

కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిన్న (ఆగస్ట్‌ 10) జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. మపాకా (4-0-20-4), రబాడ (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో 20 ఓవరల్లో 178 పరుగులకు ఆలౌటైంది.

75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో టిమ్‌ డేవిడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. అతనికి కెమరూన్‌ గ్రీన్‌ (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సహకరించాడు.

అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్‌వుడ్‌ (4-0-27-3), డ్వార్షుయిస్‌ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్‌వెల్‌ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రికెల్టన్‌ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్‌) ఒక్కడే రాణించాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టీ20 ఆగస్ట్‌ 12న జరుగనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement