అశ్విన్‌ విషయాన్ని కోహ్లికి వదిలేసి విజయాన్ని ఆస్వాధించండి: ఏబీడీ

AB De Villiers Tweet Stands Out After India Win Against England At The Oval - Sakshi

లండన్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్‌ సహచర క్రికెటర్‌, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అండగా నిలిచాడు. తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. తుది జట్టులో యాష్‌కు స్థానం కల్పించకపోవడంపై జరుగుతున్న అనవసర రాద్దాంతం నేపథ్యంలో మిస్టర్‌ 360 ఆటగాడు ఈమేరకు స్పందించాడు. ఈ విషయమై టీమిండియా అభిమానులు ఆందోళన చెందకుండా, కోహ్లి సేన సాధించిన విజయాలను ఆస్వాదించాలని సూచించాడు. కెప్టెన్సీ విషయంలో కోహ్లి సూపర్‌ అని ఆకాశానికెత్తాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా దక్కలేదు. నాలుగు టెస్ట్‌ల్లో యాష్‌కు నిరాశే ఎదురైంది.

ఓవల్‌ మైదానంలో అశ్విన్‌కు మంచి రికార్డు ఉండటంతో నాలుగో టెస్ట్‌లో అతనికి చోటు ఖాయమేనని అంతా భావించారు. అయితే, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ మాత్రం అశ్విన్‌ను కాదని జడేజావైపే మొగ్గుచూపాడు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ విధానాన్నే అనుసరించాడు. ఏకైక స్పిన్నర్‌ కోటాలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజాకు తిరిగి అవకాశమిచ్చాడు. దీనిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పించారు. కోహ్లీ ఘోర తప్పిదం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రోజు మ్యాచ్ భారత్‌వైపు మళ్లే వరకు విమర్శలు కొనసాగించారు. అశ్విన్ ఉంటే భారత్ విజయం సులువయ్యేదని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే, ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 77/0తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. ఉమేశ్‌ యాదవ్‌ (3/60), శార్దూల్‌ ఠాకూర్‌ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్‌ కాగా, 290 వద్ద ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ సూపర్‌ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్‌ మ్యాన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.
చదవండి: టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ నోట పవర్‌ స్టార్‌ పాపులర్‌ డైలగ్‌..
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top