మహిళలు రాజకీయాల్లోకి రావాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు రాజకీయాల్లోకి రావాలి

Apr 14 2026 8:40 AM | Updated on Apr 14 2026 8:40 AM

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

నారీ శక్తి వందన్‌ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ

సిద్దిపేటకమాన్‌: మహిళలు రాజకీయాల్లోకి రావాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మహిళ అంటే ఒక శక్తి అని మీ నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు రావాలన్నారు. సిద్దిపేట పట్టణంలో సోమవారం నిర్వహించిన నారీ శక్తి వందన్‌ ర్యాలీలో ఎంపీ పాల్గొన్నారు. పట్టణంలోని హైస్కూల్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోడ్రన్‌ బస్టాండ్‌ చౌరస్తాలో ఎంపీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పటికీ మహిళా బిల్లు పాస్‌ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని సినిమా వాళ్లు కూడా గుర్తుపట్టడం లేదన్నారు. దేశంలో మహిళా ఎంపీల శాతం 15కంటే తక్కువగా ఉండటం బాధాకరమని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఆపరేషన్‌ సింధూరు విజయవంతంగా నిర్వహించింది కూడా ఒక మహిళేనని అన్నారు. 75సంవత్సరాల నుంచి మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదని మహిళలకు ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారన్నారు. సునీతావిలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లివచ్చారన్నారు. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ను గెలిచింది కూడా నిజామాబాద్‌ ఆడబిడ్డనే అన్నారు. దేశ ప్రథమ పౌరురాలు కూడా గిరిజన బిడ్డ అయిన ద్రౌపదిముర్ము అని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టులో 32మంది న్యాయమూర్తులు ఉంటే ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారన్నారు. హైదరాబాద్‌ మాజీ మేయర్‌ కార్తీకరెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌, పార్టీ నాయకులు వెంకట్‌, తిప్పని వనజ, ఉమారెడ్డి, సంతోష్‌, కార్తీక్‌, సరోజ, మహిళా న్యాయవాదులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement