వికసించని కమలం
● జిల్లాలో 30 మంది సర్పంచ్‌లే గెలుపు ● ఇండిపెండెంట్లకు దక్కిన స్థానాల కంటే తక్కువే.. ● తీవ్ర నిరాశలో కార్యకర్తలు
పల్లెల్లో కమలం వాడిపోయింది. ఇండిపెండెంట్లకు దక్కిన స్థానాలు సైతం గెలవలేక చతికిలపడింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇద్దరు బీజేపీ ఎంపీల పరిధిలో చాలా మండలాలు ఉన్నప్పటికీ ఉనికి చాటలేదు. ఎన్నికల ఫలితాలను చూస్తే పార్టీ పట్టుకోల్పోయిందన్న చర్చ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 5.90శాతం సీట్లు మాత్రమే బీజేపీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. సంస్థాగతంగా గ్రామ స్థాయిలో బలోపేతం కావాలని ఉవ్విళ్లూరిన బీజేపీ సత్తా చాటడంలో విఫలమైంది. – సాక్షి, సిద్దిపేట
‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ డీలా
జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో 26 మండలాల్లోని 508 గ్రామ సర్పంచ్‌లకు ఎన్నికలు జరగాయి. కేవలం 30 సర్పంచ్ స్థానాలు మాత్రమే బీజేపీకి దక్కాయి. మొదటి విడతలో 10, రెండో విడతలో 13, మూడో విడతలో 7 సర్పంచ్ స్థానాలలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఈ మూడు విడతల్లో ఇండిపెండెంట్‌లు 52 మంది విజయం సాధించారు. ఇండిపెండెంట్లు గెలుపొందిన సంఖ్య సైతం బీజేపీకి దక్కలేదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను జిల్లా నాయకత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా? అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపాధి హామీ పథకంతో పాటు పలు పథకాలు కొనసాగుతున్నా.. వాటిని ప్రచారం చేయడంలో పార్టీ నేతలు విఫలమయ్యారని తెలుస్తోంది. పలు గ్రామ పంచాయతీల పరిధిలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటమి చెందారు. సిద్దిపేట నియోజకవర్గంలో మూడు చోట్ల మాత్రమే బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. గెలుపొందిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘ఎన్నికల సమయంలో పట్టించుకోలేదని.. ఇప్పుడు గెలుపొందిన తర్వాత మేము కావాల్సి వచ్చామా? అని పలువురు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
వర్గపోరును కట్టడి చేస్తేనే..
పార్టీలో వర్గపోరును కట్టడి చేసి నేతలను ఏకం చేస్తే తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావడం కష్టమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఒక వర్గం నేతలు జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇప్పటికై నా అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి అందరిని ఒక్కతాటి పైకి తీసుకవచ్చి పార్టీని ముందుకు తీసుకవెళ్లాలని కార్యకర్తలు కోరుతున్నారు.
మెదక్, కరీంనగర్ ఎంపీలుగా రఘునందన్ రావు, బండి సంజయ్‌లు గెలుపొందడంతో పార్టీలో జోష్ కనిపించినా.. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందకపొవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం అలుముకుంది. రాబోయే కాలమంతా ఎన్నికల కాలం.. ఇలాంటి సమయంలో కేడర్ అంతా నిరుత్సాహంలో ఉంటే ఎలా అని కార్యకర్తలు అయోమయానికి గురవు తున్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జిల్లాలో జరగనున్నాయి. పరిస్థితి ఇలానే కొన సాగితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రభావం పడే అవకాశాలున్నాయి.
తొగుటలో ఖాతా తెరిచి..
తొగుట(దుబ్బాక): మండలంలో ఎట్టకేలకు బీజేపీ ఖాతా తెరించింది. పంచాయతీ ఎన్నికల్లో మొదటి సారిగా ఆ పార్టీ నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి దిగారు. వరదరాజుపల్లిలో పార్టీ నాయకుడు ఎర్వ గోపాల్‌రెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు. తొగుట, తుక్కాపూర్, లింగాపూర్, కాన్గల్, గుడికందుల, గోవర్ధనగిరి, వర్దరాజుపల్లి గ్రామాల్లో బీజేపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులు బరిలోకి దిగారు. గుడికందుల, లింగాపూర్, గోవర్ధనగిరిలో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. రెండు చోట్ల ద్వితీయ స్థానంలో నిలవగా మిగతా చోట్ల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపినట్లు మండలంలో చర్చజరుగుతోంది. తుక్కాపూర్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం తన భార్యను రంగంలోకి దింపారు. కారణమేంటో తెలియదుగాని బరిలో నుంచి అర్ధంతరంగా తప్పుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఏమేరకు సత్తా చూపుతారో వేచిచూడాలి.


