ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం చేరాలి
● రైతులకు అవగాహన కల్పించాలి ● అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి ● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్, మైక్రో ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 13,576 ఆయిల్ పామ్ మొక్కలు ప్లాంటేషన్ జరిగినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 6,500 ఎకరాల లక్ష్యానికి 1,536 ఎకరాల్లో మాత్రమే ప్లాంటేషన్ పూర్తి చేశారన్నారు. ఆశించిన స్థాయిలో సాగు లేదని అసహనం వ్యక్తం చేశారు. రబీ సీజన్‌కు సన్నద్ధమయ్యే లోపు ప్రతి రైతుని కలిసి ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ వారం మొత్తం స్పెషల్ డ్రైవ్ గా తీసుకుని ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. మీకు ఇచ్చిన టార్గెట్ తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్య వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించండి
పీహెచ్‌సీకి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, వైద్య సేవలను పరిశీలించారు. రికార్డులు చక్కగా నిర్వహించాలని, మొక్కుబడిగా రాస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


