‘ప్రజా పాలన’ను ఆశీర్వదించారు
సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపించాయి: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆశీర్వదించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. అంతకు ముందు ఉదయం కార్యకర్తలతో కలిసి బైక్ నడుపుతూ గల్లి గల్లి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో సర్పంచ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో 171 సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు జరిగితే 108 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారన్నారు. మరో 11 మంది ఇండిపెండెంట్లు కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్తల కృషి వల్లే అత్యధిక స్ధానాల్లో గెలిచామన్నారు. నియోజకవర్గంలో 80 శాతం పైగా పోలింగ్ జరిగిన గ్రామాలకు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతో పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, వ్యవసాయం, టూరిజం అన్ని రంగాల్లో అబివృద్ధి చేస్తామన్నారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, అధికారులు పాల్గొన్నారు.


