పల్లె దశ మారేనా?
పెరిగిన రోగాల వ్యాప్తి కరువైన మౌలిక వసతులు 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు
జిల్లాలోని 26 మండలాల్లో 508 పంచాయతీలు ఉన్నాయి. మొదటి విడతలో 163, రెండో విడతలో 182, మూడో విడతలో 163 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 22న కొత్త సర్పంచ్‌లు కొలువు దీరనున్నారు. ఈనేపథ్యంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపైనే అందరి దృష్టి నెలకొంది. గత 2024 ఫిబ్రవరి నెలలో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. దీంతో 20 నెలలకుపైగా పంచాయతీలకు నిధులు నిలిచిపోయాయి. 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఎఫ్‌ఎసీ, ఉపాధిహామీ తదితర పథకాల అమలు ఆగిపోయింది. ఫలితంగా ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ప్రత్యేకించి గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. చాలా గ్రామాల్లో పంచాయతీలకు కేటాయించిన చెత్త సేకరణ ట్రాక్టర్లకు డీజీల్ పోయించుకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల పారిశుద్ధ్య నిర్వహణ గాలికొదిసినట్లయ్యింది. దాదాపు అన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. ఈ బిల్లులు అందక ఇప్పటికీ నానా తంటాలు పడుతున్నారు.
వ్యాధుల విజృంభణ
పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తి పెరిగిపోయింది. ఊర్లకు ఊళ్లు.. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి భయంకరమైన జ్వరాలు బారిన పడ్డాయి. వందల సంఖ్యలో రోగులు మంచాన పడ్డారు. గత ఆగస్టు నెలలో జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లో ఇద్దరు, అనంతసాగర్‌లో ఒకరు డెంగీ బారిన పడి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ రెండు గ్రామాల్లోనే కాదు.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో విష జ్వరాలు విజృంభించాయి. ఈ పరిస్థితి మార్చాల్సిన అధికారులు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకొన్నారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే..
పంచాయతీలకు మార్చిలోగా రెండేళ్ల 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉన్నది. 20నెలలుగా సర్పంచ్‌ల ఎన్నికలు జరగకపోవడం ఈ నిధులు రాలేదు. 2026మార్చిలోగా ఈ నిధులను రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల జనాభా దామాషా ప్రకారం ఒక్కొక్కరికి రూ.900–1400చొప్పున నిధులు రానున్నాయి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయో.. అన్ని నిధులు రాష్ట్రం నుంచి కూడా రావాల్సి ఉంది. ఉదాహరణకు 3వేల జనాభా ఉన్న గ్రామాలకు కేంద్రం నుంచి రూ.27లక్షల వరకు నిధులు వచ్చే అవకాశం ఉంది. రెండేళ్ల నిధులు ఇస్తే.. ఇది రెట్టింపు అవుతుంది. ఈ లెక్కన గ్రామాలకు దండిగా నిధులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా నిధులు విడుదల చేయడంతోపాటు ఎస్‌ఎఫ్‌సీ నిధులు కూడా ఇస్తే గ్రామాలకు మహర్దశ పట్టనుంది.
ప్రభుత్వ సహకారం కీలకం
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల సహకారమే కీలకం. గ్రామాల్లో ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. సమస్యలు కొత్త సర్పంచ్‌లకు సవాలుగా మారాయి. ప్రభుత్వాలు నిధులు విడుదల చేసి ప్రజల ఇబ్బందులను తీర్చడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం.
– ప్రభాకర్, ఆహ్మదీపూర్ సర్పంచ్, గజ్వేల్ మండలం
పడకేసిన పారిశుద్ధ్యం
పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో.. ఇక అందరి దృష్టి గ్రామాల్లో నెలకొన్న సమస్యలపైనే కేంద్రీకృతమై ఉంది. ప్రత్యేకించి కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు. కొత్త సర్పంచ్‌లు కొలువుతీరిన వెంటనే వస్తే.. మేలు జరిగే అవకాశం ఉంది.
–గజ్వేల్


