ఎన్నికల నియమావళి తప్పనిసరి
దుబ్బాకటౌన్: ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక పాటించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, 100 నుంచి 200 మీటర్ల పరిధిలో ప్రత్యేక నిబంధనలు ఉండటంతో ప్రజలు అనవసరంగా గుమిగూడకూడదని తెలిపారు. ఓటర్లు క్యూ లైన్ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారి పై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, గజ్వేల్ ఏసీపీ నరసింహులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, తొగుట సీఐ లతీఫ్, సీసీఆర్బి ఇన్‌స్పెపక్టర్ రామకృష్ణ, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్


