గొప్ప దార్శనికుడు రాజేశ్వరరావు
విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు
ఎమ్మెల్సీలు దేశపతి, సురభివాణి
ఘనంగా శతజయంతి ఉత్సవాలు
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రాంతానికి విద్యుత్ కాంతులతో పాటు విద్యాకాంతులను పంచిన మహనీయుడు, మాజీ ఎమ్మెల్యే పండరి వెంకట రాజేశ్వరరావు అని ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభివాణీ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో సోమవారం రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేటకు డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయించిన గొప్పవ్యక్తి రాజేశ్వరరావు అని అన్నారు. వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన కళాశాల మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకులను అందించిందని చెప్పారు. దార్శనికతతో చేసిన గొప్ప పనులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. సిద్దిపేట ప్రాంతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ 1956లో 36 మంది విద్యార్థులో ప్రారంభమైన కళాశాల ప్రస్తుతం 22 యూజీ కోర్సులు, 12 పీజీ కోర్సులతో 4,500ల మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఎదిగిందన్నారు. నాటి నుంచి కళాశాల ఎంతో మంది ఐఏఎస్‌లను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, రాజకీయనాయకులను, సామాజికవేత్తలను, ఉద్యోగులను, కళాకారులను అందించిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, దేవీప్రసాద్, డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ పాపయ్య, రాఘవేందర్‌రావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డితో పాటు రాజేశ్వర్‌రావు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


