‘గుర్తు’ంచుకో
హలో తమ్మి..
● అభ్యర్థుల మంతనాలు ● నేటితో ముగియనున్న మొదటి దశ ప్రచారం ● యువ ఓటర్ల పైనే ఆశలు
‘ఏం తమ్మి అంతా మంచిదేనా.. కుటుంబ సభ్యులందరూ బాగున్నారా.. ఈ మధ్య ఊరికి వచ్చుడే బంద్‌జేసినవ్.. ఓటేసేందుకు తప్పక రావాలి.. నేను పలానా గుర్తుకు నిలబడినా.. ’ అంటూ కొందరు సర్పంచ్ అభ్యర్థులు కనిపించిన యువకులతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఫోన్ల ద్వారా సంప్రదిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రాధేయపడుతుండటంతో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
– దుబ్బాకటౌన్
జిల్లాలో మొదటి విడత జరిగే పంచాయతీ ఎన్నికలల్లో భాగంగా గజ్వేల్ డివిజన్‌లో మంగళవారంతో ప్రచారం ముగియనుంది. దీంతో సోమవారం ప్రచారం జోరందుకుంది. కోడికూత కూయగానే అభ్యర్థులు చలిని సైతం లెక్క చేయకుండా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజు సమయం ఉండటంతో ముమ్మరంగా ప్రచారం చేశారు. అటు సోషల్ మీడియాలో సైతం పలానా గుర్తుకు ఓటేయాలని స్టేటస్‌లు పెడుతూ..సమీప బంధువులు, స్నేహితులతో సైతం స్టేటస్‌లు పెట్టిస్తుండటం గమనార్హం.
జర ఓటేయమని చెప్పవా..
బాపు కొడుకుకి ఫోన్ చేసినా ఎత్తడం లేదు. జర ఫోన్ చేసినపుడు జర ఓటేయమని చెప్పు. గెలుస్తే తప్పక ఏ సమస్య వచ్చినా తీరుస్తా.. అని ఇంటింటికీ ప్రచారం చేస్తూ పట్టణంలోని యువకుల ఓట్ల కోసం బతిమాలుతున్నారు.


