బహుళజాతి ప్రయోజనాల కోసమే విత్తనచట్టం
దుబ్బాక: బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసమే కేంద్రం కొత్తగా విత్తనచట్టం తెచ్చిందని రైతు కూలిసంఘం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో విత్తన చట్టం ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు కూలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామి, జిల్లా అధ్యక్షుడు ఎల్లన్న, ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ సంతోష్ మాట్లాడుతూ ఇది పూర్తిగా రైతు వ్యతిరేక చట్టమన్నారు. ఈ చట్టంతో విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, ఆహార భద్రత లేకపోగా బహుళ జాతి, ప్రైవేట్ కంపెనీల నియంత్రణలో కొనసాగే విధంగా ఉందన్నారు. రైతు కేంద్రీకృత వ్యవస్థను బలహీనపర్చడమే కాకుండా జీవవైవిధ్య పరిరక్షణ, రైతుల హక్కుల కు సంబంధించిన భారత న్యాయనిర్మాణాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఇది పూర్తిగా కార్పొరేట్ సంస్థల లాభం కోసం పనిచేసే చట్టం అన్నారు. కార్యక్రమంలో రైతు కూలిసంఘం జిల్లా నాయకులు మేకల రాములు, శ్రామికశక్తి బీడీవర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు శ్రీదేవి, లక్ష్మణ్, రాజేష్, శేఖర్ ఉన్నారు.


