పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించండి
● కలెక్టర్ హైమావతి ● సమస్యాత్మక గ్రామాల సందర్శన
గజ్వేల్: పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం గజ్వేల్ మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన శ్రీగిరిపల్లి, సింగాటం, జాలిగామ గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా జరిపేలా కృషి చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా, లైట్లు, ఫ్యాన్లు, ర్యాంపు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, మంచినీరు తదితర కనీస వసతులను కల్పించాలని చెప్పారు. లైవ్ వెబ్‌కాస్టింగ్ కోసం నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటరు స్లిప్పులను వందశాతం పంపిణీ చేయాలని ఆదేశించారు.


