మల్లన్నా.. పల్లకీ సేవ ఏమాయె!
ఏళ్లుగా భక్తుల ఎదురుచూపులు
● మూడేళ్లక్రితం అనుమతిచ్చినా నేటికీ అమలు కాని దుస్థితి ● ఆలయ వర్గాల జాప్యమే కారణమా?
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న భక్తులు పల్లకీ సేవ భాగ్యం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో కొనసాగిన ఉత్సవ మూర్తుల సేవను పునరుద్ధరించేందుకు దేవాదాయ శాఖ అనుమతి ఇవ్వడంతో తిరిగి ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించి మూడేళ్లవుతున్నా.. నేటికీ అమలుకునోచుకోవడంలేదు. వాస్తవానికి ఆలయాల్లో ప్రతిష్ఠించిన మూల విరాట్‌ను కదిలించే అవకాశం ఉండదు. ఉత్సవ విగ్రహాలకు పూజలు చేస్తూ ఉత్సవాలకు వినియోగిస్తారు. స్వామి వారి పూజలకు సంబంధించి పల్లకీ సేవ కూడా ఉపాచారంగా భావించి ఉత్సవ మూర్తులతో ఉత్సవాలు నిర్వహిస్తారు. తద్వారా పల్లకీ మోసిన వారికి, దేవతామూర్తులను చూసిన వారికి సంపూర్ణం అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. గతంలో నిత్యం సాయంత్రం వేళ ఆలయ మండపం నుంచి రాతిగీరల వరకు పల్లకీ సేవ నిర్వహించేవారు. అందుకు టికెట్ ధర రూ.65 ఉండేది. సుమారు 26 ఏళ్ల క్రితం ఈసేవను ఆలయంలో నిలిపేశారు. తదనంతరం ఎవరూ పట్టించుకోలేదు. ఇతర ఆలయాల్లో పల్లకీ సేవా కొనసాగుతుండడంతో ఇక్కడ కూడా పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే విన్నపంతో..
ఈవిషయమై మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి నాలుగేళ్ల క్రితం సూచనలు చేయడంతో ఆలయ వర్గాలు సమీక్షించి టికెట్ ధర రూ.500 నిర్ణయిస్తూ దేవాదాయశాఖకు ప్రతి పాదనలు పంపించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనమతినివ్వడంతో 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. కానీ ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. గతంతో గ్రామంలోని పద్మశాలీ కులస్తులు పల్లకీని మోసేవారు. అందుకు వారికి టికెట్ ధరలో కొంత భాగం ఆలయ వర్గాలు చెల్లించేవారు. ప్రస్తుతం టికెట్ తీసకున్న భక్తులే నేరుగా పల్లకీ మోసేందకు అనుమతి నివ్వాలని భక్తులు కోరుతున్నారు. ఏదీ ఎమైనా ఆలయంలో పల్లకీ సేవా ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. మరి ఆలయ అధికారులు ఎప్పుడు ప్రారంభిస్తారో వేచిచూడాల్సిందే
ఆలయంలో భక్తుల రద్దీ..
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి భక్తులు ఆదివారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణంతో మారుమోగాయి. వేకువజామునుంచే కోనేరులో స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణిచెట్టువద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గుకళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
ఆనవాయితీ కొనసాగించాలి
ఆలయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాల పల్లకీ సేవను గతంలో పద్మశాలీ కులస్తులే నిర్వహించేవారు. ప్రస్తుతం ఉత్సవాల సమయంలో కూడా పద్మశాలీలే పల్లకీని మోస్తున్నారు. అదే సంప్రదాయాన్ని ఆలయ అధికారులు కొనసాగించాలి.
– కొండ శ్రీధర్, పద్మశాలీ కులస్తుడు
త్వరలోనే నిర్ణయిస్తాం
ఆలయ ఈఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. దేవాదాయ శాఖ అధికారులు పల్లకీ సేవ పునరుద్ధరణకు అనుమతినిచ్చిన విషయం వాస్తవమే. తిరిగి ప్రారంభించేందుకు ఆలయ వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
– టంకసాల వెంకటేశ్, ఆలయ ఈఓ
రాజగోపురం ఎదుట
భక్తుల సందడి


