గెలుపే ముఖ్యం
అధిక స్థానాలే లక్ష్యం
పంచాయతీ ఎన్నికలపై పార్టీలు సీరియస్‌గా దృష్టి పెట్టాయి. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాయి. మొదటి విడత ఎన్నికల పోలింగ్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మరింతగా అప్రమత్తమయ్యాయి. కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నాయి. – గజ్వేల్
మొదటి విడత పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, వర్గల్ మండలాలు, దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో మొదటి విడత జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈనెల 11న పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చే ఫలితాలే రెండు, మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందునా.. ప్రధాన పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకెళ్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌తోపాటు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ
గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 148 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 12 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 136 స్థానాల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా ఈ నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ మెజార్టీ స్థానాల సాధనపై గురి పెట్టింది. ఈ క్రమంలోనే రెండు పార్టీలు అప్రమత్తమై ఎత్తుకు పైఎత్తులతో ముందుకుసాగుతున్నాయి. కాంగ్రెస్‌కు సంబంధించి ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో మొదటి ఎన్నికలు జరిగే గ్రామాల పరిస్థితిపై సమీక్షించారు. ఎలాగైనా మెజార్టీ స్థానాలను సాధించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని పిలుపునిచ్చారు. మొత్తానికి ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.
బీఆర్‌ఎస్ నేతల సమీక్షలు..
ఇకపోతే బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సమన్వయంతో నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులతో ఎన్నికలపై నిత్యం సమీక్షిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో విస్త్రతంగా పాల్గొంటున్నారు. అభ్యర్థులు బలహీనంగా ఉన్న గ్రామాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణను ఎప్పటికప్పుడు కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సైతం తమ అభ్యర్థులు బరిలో ఉన్న గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించే గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.
దుబ్బాక నియోజకర్గంలో..
దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని 25 పంచాయతీలు, రాయపోల్ మండలంలోని 19 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా అధిక స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పోటీపడుతున్నాయి. బీజేపీ సైతం తనదైన శైలిలో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మొత్తానికి మొదటి విడత ఎన్నికల ఫలితాలు మూడు రోజుల తర్వాత తేలనుండగా, సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పంచాయతీ ఎన్నికలపైపార్టీల ప్రత్యేక నజర్
మొదటి విడత పోలింగ్‌సమీపిస్తుండటంతో అప్రమత్తం
కార్యకర్తలు, మద్దతుదారులతో జోరుగా సమీక్షలు


