ఏకగ్రీవ స్ఫూర్తితో అభివృద్ధి చేయండి
సిద్దిపేటజోన్: గ్రామంలో ఏకగ్రీవంగా ఆమోదం ఎలా సాధించారో అదే తరహాలో ఐక్యతతో గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బొగ్గులోనిబండ, రామంచ గ్రామాల ఏకగ్రీవ సర్పంచ్‌లు, గ్రామస్తులు మర్యాదపూర్వకంగా హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు గ్రామాలు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్నారని, ఇదే స్ఫూర్తితో అభివృద్ధికి అందరూ సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తానన్నారు. గ్రామాలు ఆదర్శంగా నిలిచేలా పాలక వర్గాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల మన్ననలు పొందాలన్నారు. రామంచలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. 20 ఏళ్ల క్రితం తొలిసారిగా రామంచలో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. నిండు మనసుతో ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వారి ఆకాంక్షలు నిజం చేయాలని సూచించారు. అనంతరం బొగ్గులోనిబండ ఏకగ్రీవ సర్పంచ్ అందే శంకర్, రామంచ ఏకగ్రీవ సర్పంచ్ భవానిలను ఆయన అభినందించారు.
విద్యార్థినికి చేయూత
సిద్దిపేటజోన్: పేద దళిత విద్యార్థిని వైద్యవిద్య కోసం ఎమ్మెల్యే హరీశ్‌రావు అండగా నిలిచారు. పట్టణానికి చెందిన పెరక శ్రీజకు కరీంనగర్ చలమేడ ఆనందరావు మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని తెలుసుకున్న హరీశ్‌రావు ఈ ఏడాది కళాశాల ఫీజు కోసం ఆమెకు రూ.60 వేలు అందించారు. వైద్య విద్య పూర్తయ్యేవరకు ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీజ కుటుంబ సభ్యులు హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎమ్మెల్యేగా సంపూర్ణ సహకారం అందిస్తా
ఏకగ్రీవ గ్రామాల ప్రతినిధులకు భరోసా


