ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
● 15 కిలోల కణతి తొలగింపు ● సూపరింటెండెంట్ సంగీత, డాక్టర్ చందర్
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి ఓ మహిళ కడుపులో నుంచి 15 కిలోల కణతిని తొలగించారు. ఈ ఘటన ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేటకు చెందిన 59 యేళ్ల మహిళ కొన్ని నెలలుగా కడుపు నొప్పి, ఉబ్బసంతో బాధపడుతోంది. ఆర్‌ఎంపీల వద్ద చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో పది రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. పలు రకాల పరీక్షలు నిర్వహించి ఆమె కడుపులో పెద్ద కణతి ఉన్నట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం వైద్యులు చందర్, అనుపమ, సహస, రవిమోహన్, దేవేందర్, అభిషేక్ మూడు గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి 15 కిలోల కణతిని తొలగించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతోందని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్, సూపరింటెండెంట్ సంగీత సర్జరీ చేసిన వైద్య బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ఎంఓ జ్యోతి, ఆర్‌ఎంఓలు శ్రావణి, సదానందం తదితరులు పాల్గొన్నారు.


