ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 63 మందిపై కేసు
దుబ్బాకరూరల్: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 63 మందిపైపోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. అక్బర్‌పేట–భూంపల్లి మండలం తాళ్లపల్లి సర్పంచ్ అభ్యర్థి జనరల్ కావడంతో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరంతా బీసీ ముదిరాజ్ కులానికి చెందిన వారు కావడం.. గ్రామంలో వారి ఓట్లు ఎక్కువగా ఉండటంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఒకే అభ్యర్థి పోటీలో ఉండాలనే కులస్తుంతా నిర్ణయానికి వచ్చారు. కులదేవత పెద్దమ్మ గుడి నిర్మాణానికి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వారే సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండాలని వారికే ఓటు వేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ హరీశ్ తన సిబ్బందితో చేరుకుని విచారించారు. విషయం నిజం కావడంతో ఎన్నికలకోడ్ ఉల్లంఘించారని సుమోటో పిటిషన్‌పై ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు, 56మందితో సహా మొత్తం 63మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. గురువారం 63 మందిని భూంపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు పరిచారు. ఏసీపీ రవీందర్, సీఐ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెడితే ఎంతటి వారైనా చట్ట పరంగా చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.


