తొగుట(దుబ్బాక): మండల పరిధిలోని తుక్కాపూర్ అభివృద్ధికి కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. తుక్కాపూర్‌లో పెద్దమ్మ, పోచమ్మ దేవాలయాల ప్రహరీల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ దేవాలయ ఆవరణలో ముదిరాజ్ కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామం నుంచి అనేక కుటుంబాలు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాన మంత్రి హర్‌ఘర్ సూర్యయోజన్ పథకంలో భాగంగా ప్రతి కుటుంబం సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.72వేలు సబ్సిడీ అందిస్తోందన్నారు. సంబంధిత అధికారిని గ్రామానికి పంపిస్తామని, గ్రామస్తులు సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మండలంలోని కాన్గల్ రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీకి బీజేపీ నాయకుడు చంద్రశేఖర్‌గౌడ్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి విభీషణ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రం, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


