బానిసలుగా మార్చేందుకే నూతన కోడ్‌లు
సీఐటీయూ నాయకులు
గజ్వేల్‌రూరల్/కొమురవెల్లి(సిద్దిపేట)/దుబ్బాక: కార్మికవర్గాన్ని కార్పొరేట్ యాజమాన్యాలకు బానిసగా మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన కార్మిక కోడ్‌లను తీసుకువచ్చిందని, వాటిని వెంట నే రద్దు చేయాలని సీఐటీయూ నాయుకులు డిమాండ్ చేశారు. నూతన కోడ్‌ల అమలును వ్యతిరేకిస్తూ శనివారం వారు వివిధ చోట్ల నిరసన కార్య క్రమాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులోగల రాణే పరిశ్రమ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ నూతన కార్మిక కోడ్ చట్టాలను రద్దుచేసే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బండ్ల స్వామి, వేణుగోపాల్, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్రావ్, భిక్షపతి, సాజిద్, యాదగిరి, ఎల్లయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కొమురవెల్లిలో జిల్లా ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులు హరించే విధంగా ఉన్నాయన్నారు. వాటిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నర్సింహులు, రవి, కవిత, సుశీల, చంద్రం తదితరులు పాల్గొన్నారు. దుబ్బాకలో పట్టణ కన్వీనర్ భాస్కర్ ఆధ్వర్యంలో కార్మికులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కోడ్లతో కార్మికులు చాలా హక్కులు, ప్రయోజనాలు కోల్పోతారన్నారు శ్రీనివాస్, మల్లేశం, ఎల్లం సాజిద్, రాజు తదితరులపాల్గొన్నారు.


