దేశ నిర్మాణంలో యువత కీలకం
● ఎంపీ రఘునందన్‌రావు
● దుబ్బాకలో ఘనంగా ఏక్తా ర్యాలీ
● పాల్గొన్న అదనపు కలెక్టర్, విద్యార్థులు
దుబ్బాక : ఏక్ భారత్.. శ్రేష్ట భారత్‌గా ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలుద్దామని, 2047 నాటికి వికసిత్ భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం దుబ్బాక పట్టణంలోని అంగడి బజార్‌లో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి ఎంపీ ఏక్తా ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారి గుండా విద్యార్థులతో భారీ ర్యాలీని నిర్వహించి గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ జాతీయ సమైక్యతపై ప్రతిజ్ఞ చేయించి, మాట్లాడారు. దేశ సమైక్యతకు భంగం కలిగిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్, జమ్ము కశ్మీర్ వంటి కొన్ని రాజ్యాలు స్వతంత్రదేశాల్లా నిలవాలని ప్రయత్నించినా అడ్డుకొని భారతదేశంలో విలీనం కావడంలో సర్దార్ పటేల్ తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేశారు. విశ్వగురువు భారత్ లక్ష్యం సాధనలో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్, తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంఈఓ ప్రభుదాసుతో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.


